అలలు అలలుగా
తేది 05-10-2023
శీర్షిక : మధుర జ్ఞాపకాలు.
జీవనయానంలో బ్రతుకుజీవుడా
అనుకుంటూ రోజులెల్లబోసిన మాకు
నలుబదేండ్ల పదవీ విరమణ అయ్యామో
లేదో…ఆలోచలన్నీ విహంగములయ్యాయి ...
అనుకోకుండా నేర్చుకున్న చోటనే
కూర్చుకున్నట్టు పట్టుమని డిగ్రీ చదివిన
పట్టణంలోనే స్థిరనివాసమేర్చుకోగానే
ఆశలతో కాంతిరేఖలకై కనులు వెదికాయి...
కారుచీకటిలో కాంతిరేఖలా కరోనా కాలంలో
కలిసిందో వసంతరాగం ద్రోణుని రూపంలో…
ద్రోణహృదయం పుస్తకావిష్కరణంలో బాణమైంది
పూర్వ విద్యార్థుల సంగమం ఆలోచన …
నలుబదైదేండ్ల కలయికకు అంకురార్పణతో
మానసమంతా మధురోహలతో ఓలలాడింది..
సంసారసాగరపు సంగమంలో పాయలుగా
విడిపోయిన నదీమతల్లులలా తల్లడిల్లి…
పునర్ కలయిక పుణ్యభూమిపై ప్రేమలా
అలలై సాగింది పరస్పరమైన పంపకాలతో
అపారమైన అనుభవాల గుణ నిధులను…
అఖండమైన జ్ఞాన సంపదల సందోహాలను…
కొంత సమయమైతే గాని తీరని కోరికలే..
కోలాహలమై సాగింది ఆరోగ్యాల పలకరింపులు
వాస్తవ వారసత్వాల స్థిరత్వాల కబుర్లు…
తాతయ్యల అమ్మమ్మల నానమ్మల పదోన్నతుల
పరామర్శలతో…
అలా అలా గడిచిన కాలం గమనించనేలేదు..
అంతలో ఆవిష్కారమాయె అపురూప సన్నివేశం
ఆత్మీయ సత్కారాలు ఆనాటి గురువులకు సోపతులకు
సంభ్రమాశ్చర్యములే సభలో నెలకొన్న సందళ్ళతో…
అపురూపమైన ద్రోణుడి కమ్మని ఆతిథ్యంతో
ఆత్మారాములంతా చల్లబడి సేదదీరారు
అక్కడకూడ సమూహల సమావేశాలే …
అయినా తీరని దాహాలే ఆత్మీయ పలకరింపులు…
రోజెంత
చిన్నగైపోయిందోనని తీరని బెంగలతో
తీర్థం నుండి బయటికెళ్తున్నంత బాధ పడ్డాం ...
మళ్ళీ మళ్ళీ మనమంతా నియమిత
కాలానుగుణంగా కలుసుకోవాలనే
ఆకాంక్షల వెల్లువలతో ఆనందవర్షాలు
కురిశాయి కళ్ళల్లో మెరుపుల కాంతులు….
మరుపురాని మధురమైన మనో సన్నివేశం
మరుజన్మకైనా సరిపడే మధురానుభూతులు..
మరల మరల జరగాలని కోరుకునే కోరికలు
పాదాలు
కదిలాయి భారంగా కదలేక నిజంగా…
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment