Wednesday, June 12, 2024

చూపుల చెమరింతలు తేది 18-10-2023 శీర్షిక : ఆత్మీయ హస్తం.

 చూపుల చెమరింతలు 

తేది 18-10-2023
శీర్షిక : ఆత్మీయ హస్తం.  

పైరగాలికి ఊగే పంటపొలంలా 
పడుతూ లేస్తూ అడుగులు 
వేస్తున్నపుడు… అల్లంత దూరాన
ఆత్మీయ హస్తమై అమ్మ నిలిచి 
రా… రమ్మంటుంటే… 

కఠోరమైన కాలం పరీక్షలో కాకలు 
తీరాలని వేసే తొలి అడుగులలో 
తటపటలౌతుంటే వెన్నుతట్టి ప్రోత్సహించి
వెనుక నిలబడే నాన్న మాటలు ...

భ్రమించే అంబరపు అనంత విశ్వంలో 
దగాలన్నీ దహిస్తున్నవేళ..దిక్కుతోచని 
దిగ్బంధములో..దిగాలుపడి దిక్కులు 
చూసే సమయములో ఆపన్నమైన 
మిత్ర హస్తమొకటి అందినచాలు ... 

చెప్పుడు మాటల తోటలలో
చేయని తప్పులకు శిక్షలు పడి 
చెడు చెవులు కొరుక్కుంటుంటే 
చేతలుడిగి చేష్టలుడిగినప్పుడు 
నేనున్నానంటూ చెప్పే ధైర్యవచనాలు ... 

కాలమాన పరిస్థితులలో కనికరం లేకుండా 
కలబడి పలకరించే కష్ట నష్టాలలో కలిమిలేముల్లో 
సుఖ దుఃఖాలలో... నీవు ఒంటరివి కావనే 
 చూపుల చెమరింతలే దివ్య ఔషధాలు...

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment