Wednesday, June 12, 2024

మౌన సంభాషణలు తేది 17-10-2023 శీర్షిక : మౌనమే మర్మమైతే…

 మౌన సంభాషణలు 

తేది 17-10-2023
శీర్షిక : మౌనమే మర్మమైతే… 

చింతలునిండి చీకటి ఆవరించినా
వెలుగులు నిండిన వేకువలోనైనా…
మనసు తెలిపే మౌన సూచనలే 
మోముపై ప్రస్ఫుటమయ్యే మూగ సంకేతాలు...

జీవితపు అంకాలలో అప్పుడప్పుడు 
తొంగిచూసే తిప్పళ్లను పంటిబిగువున 
ఓర్చుకుంటూనైనా ... నాలుగంటే నాలుగైనా 
మంచిదే తీపి క్షణాలను మిగుల్చుకోవాలి ... 

బదులుగా దొరికిన భగవదనుగ్రహమోలె 
బధిరులకు భవబంధమే బాహువుల 
కదలికలతో భాషా ప్రపంచాన్ని పట్టి 
బంధించు భావం సుతారమై ప్రస్ఫుటించ ... 

మాటలు పూయని నోరుంటే 
కోటలు కట్టలేని చెవులుంటే 
మనసు మనసుతో మమేకమయ్యే 
మర్మం మాత్రమైతే... మంత్రముగ్దమే ...

చిక్కుముడుల పరిష్కారాలలో 
చిద్విలాసమయే భార్యా భర్తలకు .. 
కొన్ని చోట్ల శత్రువుల బారినుండి 
 చతురతలతో నిష్క్రమించుటకు ..

విశ్వ ప్రాణకోటిలో విశిష్ట లక్షణం 
మనిషికిమాత్రమే సాధ్యం ... 
అంతరాల ఆలోచనలతో మేధోమధన 
సాధ్యాలతో మాటల భాషలుగా రూపొంది 
భావ సంపదల బదిలీ వర్దిల్లె బహుళ ప్రచారమై .... 

నగునూరి రాజన్న 
కరినగరము.  

No comments:

Post a Comment