Wednesday, June 12, 2024

*అంతరంగంలో అరణ్య రోదన* శీర్షిక : అధైర్యపు మూషికాలు… తేది : 06-11-2023

  *అంతరంగంలో అరణ్య రోదన*

శీర్షిక :  అధైర్యపు మూషికాలు… 
తేది : 06-11-2023
సహస్రాధికం 

రాజుల రోజులు పోయి 
రాజ్యాలు మారిపోయినా … 
పాలనల మార్పులతో ప్రజాస్వామ్యాలైనా… 
పొల్లుపోని కలి మాటల కదంబం
పేదవాని మాటలు పెదవికి చేటులే … 

ఓటు వేసేదాకా ఓడమల్లప్పలంటూ 
కడుపులో తలకాయలు పెట్టి కావలించుకుని
కళ్ళల్లో పెట్టుకుని కాపాడుతామని ఒట్టేసి
కాళ్లు పట్టుకున్నంత పనిచేస్తారు ... 

కనపడిన మనుషులందరితో చేతులల్ల 
పనులను కలబడి.. చెంగున లాగేసుకుని..
మీ అందరి సేవకున్ని నేనంటూ నడుం 
వంచి అందమైన ఫోటోలకు పోజులిస్తారు ...

ఒక్కసారి ఓట్లపండగైపోగానే బరిలోకి దిగిపోయి
మునుము పట్టుడు షురువు చేసినారంటే... 
పక్కకు కూడా తిరిగి చూడకుండా 
పరకామణి లెక్కల్లో మునిగిపోయి 
నాణ్యతల నడ్డివిరిచేసి వడ్డిస్తుంటారు ...

ప్రజలకు వైవిధ్యమైన పథకాల ఫలహారాలతోనే
భరోసాలంటూ భ్రమల్లో ముంచుతూనే… 
అభివృద్ధిని ఆకాశ గంగలో చూపించి
విద్య వైద్యం అందని నక్షత్రాలను చేస్తున్నారు...

అంతటా ఇదే తంతు… 
చేస్తే ఆరు దండగ చేయకపోతే 
మూడు దండగల పాలనలతోనే 
పరుగుతీస్తున్న ఒంటికాలు గుర్రాలు
ఎక్కడ ఎప్పుడు కూలబడుతాయో … 

వెండి తెరల జాడల్లో ఆడుతున్న దండి 
సినిమాలలాగ..ప్రజలందరి మనసుల్లో 
ఇదే అయినా… గంటకట్టలేని అధైర్యపు 
మూషికాలై మలుచుకుని ముడుచుకుని
అరణ్యరోదనల అనుభవాలే మనసులలో
… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment