Sunday, June 2, 2024

అహాల కంచెలు తేది : 04-10-2023 శీర్షిక : గర్వపు వలువలు

 అహాల కంచెలు 

 తేది : 04-10-2023 
శీర్షిక : గర్వపు వలువలు 

 అహం బ్రహ్మాస్మి ....నెత్తిమీద తైతక్కలాడితే 
 ఎదుటి వారంతా ఎర్రినాగన్నలే 
 నామాటే చెల్లుబాటు కావాలి .... 
అర్థ  జ్ఞానాలతోనే అందలం ఎక్కుతారు…

 పక్కోడు పచ్చగా ఉంటే ఓర్చుకోలేరు .... 
 పాత పగలు లేకున్నా పనిగట్టుకుని 
 కోప తాపాలు లేకున్నా ...కాపు కాసి... 
 ఈర్ష్యా అసూయలను ఇల్లరికం చేసేసుకుంటారు ... 

 చెప్పుడు మాటలకు చెవులు చాపి 
 తప్పుడు లెక్కలు సరిచేసుకోకుండా 
 హుంకరింపుల బెదిరింపులు .... 
 కారణం లేకుండా కలబడడాలు.... 

 మొండి వాదనలకు పెట్టింది పేరై 
 వితండ వాదాలను భుజాన వేసుకుని 
 సీతయ్య ఎవరి మాట వినడనే చిలుక 
పలుకుల చిరునామాగా మారిపోవడం .... 

అయినదానికి కానిదానికీ మూర్ఖావతారంతో
గర్వపు వలువలు ధరించి అహాల కంచెలు 
అడ్డు పెట్టుకుంటే… ఏదో ఒకరోజు తన
కోపమే తనకు శత్రువై…తీరని కోరికలన్నీ 
తీర్చుతుంది అనుభవాల తోటలో చివరాఖరుకు ...... 

అహం ముళ్ళకంచెలలో అడుగేస్తే 
చివరాఖరికి నడకంతా రక్తసిక్తమే…
తీరా చూస్తే వచ్చిన దారంతా 
ఎవరికీ దాపు లేని ఒంటెత్తుపోకడే… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment