Monday, May 20, 2024

దానగుణం తేది : 30-05-2023 శీర్షిక : మిన్న

 దానగుణం 

తేది : 30-05-2023 
శీర్షిక : మిన్న 

దానగుణమును మించిన దండి 
గుణమున్నదా ధరణి పైన .... 
ఇవ్వడమే ఇలవర్షగా తెలిసిన ప్రకృతి 
తీసుకోవడానికే అలవడిన మనిషి .... 

నిలువెల్లా తపనలే తరువుకు 
పూవుగా నవ్వించాలని ...పండుగా 
కడుపులు నింపాలని .... ఎరువు 
చేసైనా సరే  కరువు తీర్చాలని ... 

చుట్టం కాకున్నా సూర్య చంద్రులు 
నక్షత్రాలు... వెలుగులు పంచి ... 
బంధువు కాకున్నా సెలయేళ్ళన్ని  
చుక్క చుక్కలో చెక్కుకున్న ఆశ 
నిక్కచ్చిగా దాహం తీర్చాలని .... 

కదిలే మేఘం మడుగు నింపితే 
పారే నది పరవశిస్తుంది పంట 
పొలాల చుట్టూ తిరిగి ....ఏవీ తమకొరకు 
కావంటూ పరుల మేలు కోరి మాత్రమే  ... 

రంతిదేవుని బోలు కొంతమంది 
స్వార్థమన్నది లేక సాగిలపడగా .... 
శిబి చక్రవర్తిని మరిపింతురు 
విధి బలీయతలను వీరముగనెదుర్కొని .... 

దానకర్ణులను తాము దాటెదమంటూ 
దండి సంపదల దాపు లేకున్నగాని 
గుండె ధైర్యమే మెండుగా గలిగి 
కాయకష్టమును నమ్ముకున్న మరికొందరు ....  

అన్ని దానములకన్న అన్నదానం 
మిన్నని కొందరంటే .... నేత్రదానమును 
మించి నేర్వగలినదేమని మరికొందరు .... 
రక్త దానము మరియు అవయవ దానములే 
అన్నింటికన్నా శ్రేష్టతరమంటూ  
నుడువుచుండిరి నేటి కాలమున ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment