నెమరువేత
తేది : 06-07-23
శీర్షిక: తేనెగూడు
సహస్రాధికం.
ఖర్చయిన రూపాయలా గడిచిన కాలం
తిరిగి పొందలేకపోయినా ...
జ్ఞాపకాల దొంతరలో దాచుకున్న
కష్టసుఖాల కలయికల భాండమది…
గతం కష్ట నష్టాల కలబోతైనా
మంచిచెడుల సమాహారంలో
మల్లెపరిమళాలను ఆస్వాదిస్తూ
శ్వాస నిలుపుకోవడమే విజ్ఞత ...
మరుపు మానవ సహజమయినా
సానబెట్టి సాధించుకోగలిగే విద్యే…
సంతసాల వింత సంతలో
సముదాయింపుల సాంత్వన
పొందే సవాలక్ష సందర్భాలే
మనుషులకు స్వస్థత లేపనాలు ...
తొలకరి చినుకులకు మురిసిపోయే
హాలికుని ఒడిలో గెంతే గింజల్లా …
పురివిప్పి నాట్యమాడే మయూరిలా నర్తించే
అవనిమాత ఒడిలో నిలిచిన అంకురాలలా..
జ్ఞాపకాల దొంతరంతా తేనెగూడు మధురిమలే…
ఎవరు మాత్రం కాదంటారు
దొంతరంతా తేనె మధురిమయితే
జుర్రుకుని చిన్నపిల్లలయి
చిందులేయకుండా ఉండగలరా ?
నగునూరి రాజన్న
No comments:
Post a Comment