Thursday, May 30, 2024

గుండె తడి. తేది : 02-07-2023 శీర్షిక : మానవత్వానికి అంటు కట్టాలి…

 గుండె తడి. 

తేది : 02-07-2023
శీర్షిక : మానవత్వానికి అంటు కట్టాలి… 

సర్వప్రాణులలో సహరాగా నిలిచినదే...
మాతృభాషలోని గమక మాధుర్యంలా…
భాష రాక పోయినా బాణీలలోని మధురిమలా…
మానవాళిలో కూడా నిబిడీకృతమైన అమృత సుధలే...

కాని ఎందుకో…..
సాటివారిని కష్టాలు కౌగిలించుకుంటున్న 
కఠిన సమయాలలో... ఆత్మీయతలతో 
చేయందించాల్సింది పోయి 
సెల్ఫీలతో మోజు తీర్చుకుంటున్న 
సాంకేతికతల చక్కిలి గింతలు... 

ఏ పాపపు కన్ను పడిందో…లేదా
ఏ కాలకూట విష  కలుషితాలో …
నిండుకుండలాంటి అమృతభాండంలో 
స్వార్థమనే విష బీజాల అంకురం.. రెక్కలు 
విచ్చుకుని... గుండెల్లో తడి మచ్చుకైనా 
కానరాకుండా చేస్తున్నది... 

అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా 
పొరుగు రాజ్యాలు  పోగయ్యి 
పొగబెట్టడంలో తలమునకలై చేయందిస్తూ…
మానవత్వం మరిచిపోయి మసులుకుంటున్నారు... 

కనులు చూడలేని కఠిన దృశ్యాలతో
చెవులు వినలేని చెడు ముచ్చట్లతో 
ఊహించలేని ఉత్పాత ఘటనలతో 
నిత్యం జనం అట్టుడికిపోతుంటే... 

ఎవరికెవరు ఈ లోకంలో అన్నచందంగా 
అధికార దాహాలు ఆ మంటలమీద 
వంటలు చేసుకుంటూ…రుచులలోని
వైవిధ్యాలను మూటగట్టుకుంటున్నాయి... 

ఇకనైనా మనమంతా తరిగిపోతున్న 
మానవత్వానికి అంటుకట్టాలి…
ఆత్మీయతల నారుపోసి అనురాగాల 
ఎరువులు వేసి…మనసులలో ఇంకా మమతల 
తడి ఆరిపోలేదని రుజువు చేయాలి.. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment