వలపు కొమ్మను తాకిన వేళ
తేది : 17-08-2023
శీర్షిక : మనసు దొంగతనం ....
మాట మాత్రం చెప్పకుండానే
మనసులో దొంగతనంగా దూరిపోయి
వద్దన్నా మననంతో ఘనమౌతూ
మంత్రించి నియంత్రించింది...
ఊహల విహారంలో తేలిపోతూ
పరవశాల పలకరింపులతో
ఒళ్ళంతా గిలిగింతలు పెట్టి
పరధ్యాన్నాల లోకమయింది ....
శీతల గాలులలో విరిసే మంచు
ముత్యాలు సైతం వేడి సెగలతో
స్వేదబిందువులై తేలు కుట్టిన
దొంగలా ... కిమ్మనకుండా ఉండేది....
మెళకువలోనే కలలలో విహరిస్తూ
మనసంతా రూపం నిండిపోయి
నన్ను నేను మరిచి మయూరమై
కనపడని మనసుతో నృత్యం చేసాను ....
అద్దంలో చూసుకుంటే
మురిపంగా సిగ్గు తెరలు...అడ్డొచ్చి
అరిందలా ప్రశ్నించింది
అంత తొందరేంటని ......
మనసు ముందుకు ...వెనుకకు ....
జడి వానలా గజిబిజి చేసినా
వలపు సంకెళ్లలో చిక్కుకుని
ఉక్కిరి బిక్కిరే ... వలపు కొమ్మను
తాకే తరుణంలో ....
నగునూరి రాజన్న.
No comments:
Post a Comment