రైలు ప్రమాదాలు
తేది 09-07-23
శీర్షిక: సాటి మనిషి…
ఉరుకులు పరుగుల జీవితాలు
గమ్యం చేరాలనే తపనలు
చీకటిని చీల్చుకుని సాగిపోయే
సాహసాలు... వెలుగును తోడు
చేసుకుని పరుగెత్తే వివేకాలు ...
బిలబిలమంటూ పిల్లా పాపలు
గలగలమంటూ ఆడామగా
ఆకలి దప్పులను అవసరార్దంగా
తీర్చుకుని గమ్యం చేరాలనే ఆరాటాలు
సీట్లు బెర్తులంటూ వాదోపవాదాలు..
బంధు మిత్ర కలయికలకై
ఎదురుచూపులు కొంతమంది..
యాత్రలకని దైవదర్శనాలకు
బయలుదేరిన వారు మరికొంతమంది ..
ఆనందాలలో మునిగి తేలి
కునుకు పలకరించిందో లేదో..
ఊహించని మృత్యువు మాత్రం
ఆవురావురమంటూ కబళించింది ..
అప్పుడే సద్దుమణిగిన అలజడి
మెల్లమెల్లగా నిశి అల్లుకుంటుంటే
మనిషిలోని రాక్షసత్వం
మేల్కొనే సమయమది
శకుని శల్యంత్రానికి
సూచనలందాగానే ...
మానవత్వం మంటగలుపుకుని
దానవత్వం వారసత్వంగా
ప్రకటించుకుని విశృంఖలతలతో
విర్రవీగి తాత్కాలిక ఆనందాలకు
తనువు మురిసిన క్షణం ...
నిర్దాక్షిణ్యతలు గూడుకట్టుకుని
నీ నా అనే వాదనలకు ఊపిరి
పోసుకుని ఊగిపోయిన క్షణం…
ఉస్సూరుమన్న వందల జీవితాలు…
జీవరాశిలో మానవాళి మిన్నని
విర్రవీగే మనిషి మాత్రం అధమమే..
సాటిమనిషిని చల్లగా చూసే
పాటి గుణమును ప్రదర్శించలేక ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment