Thursday, May 30, 2024

చిత్రకవిత. శీర్షిక: దళారీలు.

 చిత్రకవిత. 

శీర్షిక:   దళారీలు. 

స్వార్ధపు గుర్రమెక్కి స్వారీ చేస్తుంటే 
మంచీ చెడుల విచక్షణ మనసుకెక్కక 
కంట్లో పడిందంతా కాటికెళ్లేలోపుగా 
కబళించాలనే కర్కశాల అంగీ వేసుకుంటుంది... 

కాయకష్టం చేయకుండానే 
రుధిరం మదించి స్వేదం 
చిందించకుండానే....కర్షకులను 
వంచిస్తూ…గర్షలు నింపుకోగలిగే మాటల 
పందిరి వేయగలిగే సామర్థ్యం ... 

గాదెకింద పందికొక్కుల్లా తెగ బలిసి తేరగా 
సంపాదించే మార్గాలలో  డాక్టరేట్లతో   
అన్నిచోట్లా అంట్లుకట్టే వ్యవహారాలతో
అనాయాసంగా పనులు ముగించుకునే నైపుణ్యం ...

అక్కడిది ఇక్కడ…ఇక్కడిది అక్కడ 
తెలవనీయకుండా... 
మాయమాటలతో కోటలు దాటిస్తూ… 
ధవళవస్త్రాల దాపున చేరి… 
భయబ్రాంతులకు గురిచేస్తూ… 
ఎండావానల కష్టాలు తెలియ కుండానే ...
వాతానుకూల శీతల గాలుల కింద సేదదీరగలిగే నేర్పరితనం… 

ఇంకా కొంతమంది అవుతే… 
కోరమీసాలతో  కొంగజపం నటిస్తూ 
పచ్చలు పొదిగిన ప్రక్రుతిమాతను 
విచ్చల విడితనాలతో చెరబడుతూ 
చిచ్చు పెడుతున్నారు జీవరాశి పొదరింట్లో ... 

మసిపూసి మారేడుకాయలు చేసే 
మహారాజులకు కలిలో కొదువ లేదు  
కుప్పమీదచ్చే తెప్పలాటల్లా 
దళారు దండుల పోషణలకు… 

నగునూరి రాజన్న

No comments:

Post a Comment