Sunday, May 26, 2024

చిత్ర కవిత (డాబా మీద కొబ్బరాకుల కళ్యాణ మంటపం ) తేది : 25-06-2023 శీర్షిక : నిరాడంబరత

 చిత్ర కవిత  (డాబా మీద కొబ్బరాకుల కళ్యాణ మంటపం  ) 

తేది : 25-06-2023
శీర్షిక : నిరాడంబరత 

కళ్యాణం కమనీయం 
సంస్కృతికి సన్మంగళ చిహ్నం 
సంప్రదాయానికి సమున్నత అద్దం 
సనాతనమే మానవ సంక్షేమం .... 

మార్పు ఎప్పుడైనా అనివార్యం...  
మార్పు మహోన్నతమై మానవ 
కల్యాణానానికి దోహదపడాలి ... 
పురోగమనానికి మార్గం కావాలి ... 

అఖండమైన అనుభవాలే 
ఆచార సంప్రదాయాలుగా 
వినుతికెక్కి...సంస్కృతిలో భాగమై 
సన్నుతిస్తుంటాయి .... విశ్వమంతా 
పొగిడిన మన వివాహ సంస్కృతిలా  .. 
 
అనుభవ శూన్యాలతోనో... ఆకతాయి
తనాలతోనో.. పాశ్చాత్త్య మోజులతోనో...  
వెండితెరల రంగురీళ్ల  విధానాలతోనో... 
అనేక వాదాలు తలకెత్తుకుని అపహాస్యం 
మూటగట్టుకుంటున్నాయి వివాహ తంతు నేడు  ... 

పదహారేళ్లకు పండించుకోవలసిన 
జీవితాలు ముచ్చటగా మూడు పదులు 
దాటి మూలుగుతున్నాయి ...పదహారు 
రోజుల పవిత్ర తతంగమంతా మాయం ... 

వేదమంత్రాలతో ఘోషించి 
సంస్కరించుకోవాల్సిన జీవితాలను 
చూపరులకు జుగుప్సాకరంగా 
ముందు వెనకల ఛాయా చిత్రాలకు 
వీడియోలకు అప్పగించేస్తున్నారు ...

కుటుంబ సభ్యుల మధ్య ఖుషీగా సాగి  
ఆత్మీయ దీవెనలతో అందలమై మెట్లెక్కాల్సిన 
జీవితాలు .. గొప్పల కుప్పై వేలమంది 
మధ్య తూ తూ మంత్రగా కునారిల్లుతున్నది ... 

అన్నమో రామచంద్రా అంటూ 
ఒకపక్క అలమటిస్తున్న భారతంలో... 
ఆడంబరాల పందిరి నీడన 
అన్నపానీయాలను అలుగులై పారిస్తూ 
చెత్తకుప్పల్లో చెదారంగా పొర్లిస్తున్నారు ... 

వింత వింత ధోరిణిలతో .... 
విపరీత మనస్తత్వాలతో ... 
పెచ్చుమీరిన పుచ్చు విధానాలతో 
మూన్నాళ్ళ ముచ్చటై మురిసి 
పోతున్నాయి "మూడు" ముళ్ల బంధాలు .... 

ఎంతైనా పాత పద్ధతులే 
పరిణతి కలిగిన సుగంధాలు .... 
ఆత్మీయుల మధ్యన అనుబంధాల 
పచ్చని పందిరి నీడన అమిరితే 
అచ్చమైన ఆనందాలు మూట కట్టుకోవచ్చు ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment