అందంగా రాసుకుంటా
తేది : 07-08-2023
శీర్షిక : పల్లకిలో ఊరేగించరా….
అహోరాత్రులు అదేపనిగా
కలలో మెలకువలో కలతలతో
వడపోసుకుంటున్న నా బాల్య
పరిస్థితులకు విచలితమే….
విరించి పిలిచి ఫాలభాగములోని
విధివ్రాతను తిరిగి ఆరంభించే
అవకాశమిస్తేనా ....
తొందరేదో పురమాయించినట్టు
నాకన్నా ముందుగానే కనుమరుగైన
ఇరువైపులా తాతల కబుర్లన్నీ
ఇగురంగా వినుకుంటాను .....
అమ్మానాన్నల కష్టాలను
కళ్లారా చూస్తూ కసిగా ఏమి
చేయలేక తీర్చలేక
ఆర్చలేక
అచేతనమైన నాటి నా చేష్టలకు
సత్తువ జోడించి సాధించుకుంటాను ...
అక్షరజ్ఞానాలకు అల్లాడిపోయి
అధికారగణం చేతిలో కీలుబొమ్మలైన
నాటి పల్లెజనానికి అక్షరమై
ఆయుధమై... అన్యాయాలకు
చోటు లేకుండా చూసుకుంటాను .....
ఉలిపి కట్టెలన్నీ ఉనికిని దాచుకుని
రాజదండములై భ్రమలు పోయిన
బంటులందరిని ఒక్క వరుసలో
నిలబెట్టి ఓటి కుండలా ఏరేస్తాను .....
చాపకింద నీరులా చల్లంగా
సర్దిపెట్టుకున్నవారినందరినీ
సక్తుగా ప్రశ్నిస్తూ పంటికింద
రాయిలా ఎదురుపడుతాను .....
మీరంతా స్వార్థమనుకోకుంటే
మనందరికీ ఎంత ఉపయోగపడునో ....
పరికిస్తే పట్టుమని అర్థమై
నన్ను పల్లకిలో ఊరేగించరా ......
నగునూరి రాజన్న
No comments:
Post a Comment