వలస పోయిన వాడలు
తేది :23-12-23
శీర్షిక : ప్రతి ఊరు ఓ తేనె తుట్టె కావాలి
కవిత సంఖ్య : సహస్రాధికం
ఏ ఊరు చూసినా ఏమున్నది
గర్వకారణం .... తాళమేసిన
తలపులు .... కలుపుమొక్కలు
వాకిళ్లు .... చెదలు పట్టిన దర్వాజలు .....
గణాంకాల గుణింతాలతో జనాభా
పెరుగుదలలు ...కడుపు నింపని
పొంతనలేని క్రమానుగతల
పెంపుదలలతో ప్రభుత్వ పథకాలు ....
కుల్లంకుల్లా విడమరిచినట్టే
ఉంటుంది... కానీ బోధపడదు
చాలా పథకాల ప్రభావము ....
అధికారుల పనితనాల ప్రదర్శనలతో
చేతికి అందినట్టే ... కానీ మూతికి
అందనీయకుండా.... మురిపిస్తాయి...
పారిశ్రామికత కొంత పరుగులు పెట్టిస్తే
సాంకేతికత మనుషులను సాంతం
మరుగు చేసి ...ఖండాంతరాలకు
వలసల వాగులను పారించింది ....
పొరుగులతో అరుగుల ముచ్చట్లు
పెద్దలతో కళకళలాడే రచ్చబండలు
కష్టజీవుల కష్టసుఖాలను విని
అయ్యో అనే కూడళ్ల బెంచీలు
అన్నీ మూగవ్రతమాచరిస్తున్నాయి ....
ప్రణాళికాబద్ధమైన ఓటుబ్యాంకు
రాజకీయాలు...పకడ్బందీగా కష్టాలకు
రాటుదేలి కరుకు గుండెతో నిలిచి పోరే ధైర్య
సాహసాలకు సాయమందించక ....
సులభసౌకర్యవంతమైన జీవితాలను
ఆశపెట్టి శలభాలను చేసి ఆడిస్తున్నది ...
క్షణాలలో పొంగిపొర్లే ద్రవాలలా
కాకుండా....తరాలను ఓలలాడించే
తరువులాంటి ఆలోచన చేయాలె ....
ఉన్న ఊరు కన్నతల్లిలా కాచుకునే
చల్లని నీడలై సేదదీరాలి .....
పథకాలేవైనా .... ప్రతి ఊరు ఓ
తేనెతుట్టె కావాలె .... మధురాలను
గ్రోలగలిగే మందిరాలుగ వెలవాలి ....
వాడవాడ కళ్ళల్లో మెరుపులతో వెలగాలి....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment