చిత్ర కవిత
తేది : 18-06-2023 (19-06-23.. 6. 00 అం)
శీర్షిక :పిల్లల హృదయమందిరం.
అమ్మలా కడుపులోన మోయకున్నా
ఆత్మీయంగా గుండెలో నిలుపుకుంటాడు ...
రుధిరం క్షీరం చేసి బొజ్జ నింపలేకున్నా
స్వేదంగా మార్చి లవనమన్నమై
పోషణలిస్తాడు.
నడకకు చిటికెన వేలందించినా
కనిపెట్టుకునే రక్షణ కవచం ...
చల్ చల్ గుర్రమై వీపుపై ఆడించినా
గెలుపు మంత్రమై తోడుంటాడు ...
మొండికేసే కొన్ని గుర్రాలకు
రౌతుగా తాను దౌడు తీస్తాడు ...
రందిలేని పిల్లల పయనానికి
బండి చక్రం తానవుతాడు ....
కుట్టుగూసం నుండి మొదలై
కట్టుమీసం వరకన్నీ తానౌతూ ...
ఉండి లేని సంసార నావకు
సరంగై తాను సంచరిస్తాడు ....
మల్లెపూవంటి పిల్లల పళ్లెం వెనుక
మరువలేని తన వీపు గాయాలెన్నో ..
ఒంటినిండా మన వస్త్రానికి
కుంటి సాకుల మాతలబులెన్నో ...
బాధ్యతల బందీలలో చిక్కుకుని
తన ఉనికిని మరిచిపోవు ...
మన ఉన్నత గమ్యాలకు
తాను గమనమై అడుగు వేస్తాడు ....
పిల్లల ముఖంలో వెలుగులకై
తాను హారతి కర్పూరమై పోతాడు ...
తరువులా పిల్లలెదగాలని
తల్లి వేరులా కనిపించని మూలం ...
పిల్లల విజయబావుటాలకు
తాను చిరునవ్వులు చిందిస్తూ ...
ఆకాశంలో తారలా నిలవాలని
కలలు కనే హృదయమందిరం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment