స్వేచ్ఛ భారతం
తేది : 15-08-2023
శీర్షిక : మొహమాట పడుతున్నది ....
స్వేచ్ఛ మొహమాటపడుతున్నది
మర్రిచెట్ల నీడలో మరోచెట్టు
మొలవదన్నట్టుగా ....
డెబ్భై ఏండ్ల కోటరీల నీడలో
కొంగలన్నీ కలిసి జపాలు చేసుకున్నాయని..
చేపలు మాయమైన విషయం తాపీగా
తెలిసిన మనమెంత ఎడ్డితనంతో
బతికామాని చెప్పడానికి .....
ఓట్లెక్కువచ్చినోళ్ళు పాలించడమే
ప్రజాస్వామ్యమైతే...మనమిన్నాళ్ ళు
అనుభవించింది ప్రజాస్వామ్యమేనాని
అనుకోవడానికి ...చెప్పుకోవడానికి ....
సుందరమైన వందల పేజీల రాజ్యాంగం ....
పదుల్లో సవరణలు .... అయినా
పాలకులను పట్టించుకోని తత్వమే ...
అర్హతల గీతలు గీయలేకపోవడం ....
జీతాలు అలవెన్సుల జాబితాలకు
రాతలు రాయకపోవడం…
సామాన్యునికి ఓటుహక్కు
వజ్రాయుధమని...అన్యాయపు
తలలను తెగనరుకుతుందని ...గొప్పలే ....
కాని, స్వేచ్ఛగా ఓట్లేయలేకపోవడమే ..
మత్తులో ముంచాక వంచిన వేలుకు సిరా చుక్కనో
కులగోత్రాలతో కుంచించుకుపోయే భావనలతోనో
నోరు విప్పలేని నోట్ల కట్టలతో మాట్లాడమో....
పిల్లినైనా బంధించి బాదితే
పులిలా మారుతుందంటారు....
చాపకింద నీరులా ఓ వైపు వంపుతూ
విద్వేషాలకు తావిస్తున్నా.. ఎలుకల
సమావేశంలో పిల్లికి గంట కట్టే తీర్మానంలా…
స్వచ్చమైన పాలలాంటి సగటు మనుషుల
మనసులలో… విషబీజంలా విత్తుతూ
విభజించి ఫలాలు పంచిపెడుతున్నా...
విద్వత్తులన్నీ నీరుగారి నేరుగా ఏకరువు పెట్టలేక ....
కనీసం అటువైపు తొంగి చూడలేకపోవడం ....
ఓటర్ల కళ్ళల్లో మిరుమిట్లుగొలిపే
మానిఫెస్టోలతో మతాబులు వెలిగించి…
అధికారపు బంక అంటించుకున్నాక
తీరికగా అటకెక్కించినా.... వింతగా
న్యాయ శాఖలు పట్టించుకోకపోవడం ....
ఎవరికి వారు యమునాతీరేనంటూ
మతాలుగా ముఠాలు కట్టడము ....
సుతారం ఇష్టం లేదంటూనే ... తెర
వెనక జరిగిపోయే బాగోతాలను తేటతెల్లంగా
బట్టబయలు చేయలేని నిఘా విభాగాలు ....
కరకట్టలోని నీటిబొట్టు చిట్టచి వరి
కమతం చేరి పారినట్టుగా .... స్వేచ్ఛ
సగటు మనిషికి సాదరంగా చేరినప్పుడే
పరిపూర్ణత్వంగా పుణ్యమవుతుంది .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment