Sunday, May 26, 2024

నివురు... నిప్పు తేది : 22-06-23 శీర్షిక: అసలైన అవిటి తనం

 నివురు... నిప్పు

తేది : 22-06-23 
శీర్షిక:   అసలైన అవిటి తనం
సహస్రాధికం.     

ఆటవికతలే  అసలైన రక్షణలేమో 
నాగరికతలో నడిచి సాధించిందేమిటి ? 
భావ మార్పిడికి భాషలునేర్చి 
సుఖ సంతోషాల బ్రతుకనేర్చి...లాభమేంటి ? 

పైశాచికం నిండిన పశువుల్లాగే 
నిత్యం పక్కవాడిని పడగొట్టే 
మంత్ర జపాలే యంత్ర తపాలే 
మానవత్వం మరుగౌతున్న సాక్ష్యాలే ... 

కళ్ళు లేని కబోదులైనా సరే ఈనాడు 
కళ్ళే అక్కర లేని బ్రెయిలీతో కదులుతూ  
కడ దాకా పయనించి గమ్యాలను చుడుతుంటే… 
కళ్ళున్న కోట్ల మందికి  మేము  తీసి పోమంటుంటే , 
కళ్లుండి  "కంచే చేను మేసినట్టు" చేస్తున్నారు  కొందరు 
 
మాటలు రాని మూగవారు సైతం 
మతలబులన్నీ చేరవేసుకుంటూ  
మనుషుల అంతరంగాలను సృశిస్తున్నారు.  
మనసున్న మారాజులుగా  వీరు  మసులుకుంటుంటే, 
మనసు లేని రాయిగా "మాకేంటి " అంటున్నారు 
మరి కొందరు. 

చిన్నశబ్దాలను వినలేని చెవిటివారు అయినా
పెదాల కదలికలతో పదాల కూర్పులను 
ముదారవిందముగా  ఆకళింపు చేసుకుంటూ 
సుతార సంద్రంగా  కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంటే
సతాయిస్తూ  "శాడిజం" చూపిస్తున్నారు ఇంకొందరు .  

శరీరమంతా సాంత్వన లేక అల్లాడుతూనైనా
నిర్వీర్యం నొందక, తదేక తపనలు  సాగిస్తూ 
తమకు తాము నిలబెట్టుకోవాలని చూస్తూ…
తనవారికి భారం కాకూడదని తలుస్తుంటుంటే, 
అవతలి నుండి  "అమ్యామ్యాలు " ఆశిస్తున్నారు కొందరు. 

కాళ్ళు , చేతులు లేని వారైనా ఈనాడు 
కలో, గంజో కడుపులోకి  చేర్చుకోవడానికి  
కష్టాన్నే నమ్ముకుని ఇష్టంగా పని చేస్తూ…
స్వయంకృషిని మించింది లేదని నిరూపిస్తుంటుంటే, 
ఇష్టారాజ్యంగా కొందరు "దక్షిణ"లకు అర్రులు చాస్తున్నారు. 

మానసికంగా పరి పక్వత లేనివాళ్ళు సైతం    
మళ్ళీ మళ్ళీ ప్రశిక్షణలతో  చేతల పనులు 
వెదుక్కొని కొసిరి కొసిరి చేస్తూ ఆలంబనల  
ఊపిరులూదుతూ మనోవైకల్యం జయించాలని 
పట్టుదలలు చూపిస్తుంటుంటే, 
వింత మానసికతలతో విపరీతమైన "అవినీతి" ని
 ఆదరిస్తున్నారు కొందరు. 
 
మురుగుజ్జులు సైతం 
మరో ప్రపంచం సృష్టించుకుని 
వింత చేష్టలతో కొంత ఊరడిల్లుతున్నారు. 
ఎంతో ఎదుగుదల, పరిణతులను చూపిస్తుంటే,
అన్నీ మరిచి "అపర మురుగుజ్జు"గా అవతరిస్తున్నారు కొందరు.  

వారు వీరు అనే తేడాలే లేవు 
అక్కడా ఇక్కడా అనే అంతరాలే లేవు 
పౌరపాలికల నుండి పార్లమెంటు వరకు 
జనన, మరణాలు మొదలు జమాబందీల వరకు 
ఎందెందు వెదికినా అందందే కలదు అలసత్వం 
జీతాలెన్ని పెరిగినా "గీతానికి" సెలవు లేదు. 

యుగ యుగాలుగా  వేదభూమిగా వెలుగొంది 
విశ్వ మానవాళికే మార్గదర్శకమైన భారతావని 
రోజు రోజుకు పెరిగిపోతున్న  అవినీతి భూతం,
లంచగొండి  కాలుష్యములు, ఆవురావురుమంటూ 
అర్రులు చాస్తూ... 

అర్థాకలితో అలమటిస్తున్న కోట్ల జనాలను 
కొల్లగొడ్తూ, ఉసురు పోసుకుని,  ఊపిరులు
 ఊదేస్తూ  నివురు గప్పిన నిప్పులా, జడలు 
విరబోసుకుని,కరాళ నృత్యం కావిస్తూ, 
మరు భూములను తలపిస్తూ ....   

ప్రతి ప్రభుత్వ పనికి పరోక్ష ధరలను నిర్ణయిస్తూ, 
 బడా బాబులకు మాత్రమే అందుబాటై 
చడీ చప్పుడు కాకుండా కోట్ల టర్నోవర్ కు 
చోటు కల్పిస్తూ, విచ్చలవిడి తనముతో, 
ఉచ్చ నీచములు మరిచే తెరలు తీస్తున్నది.  

విశ్వ అవినీతి  లంచ గణాంకాలలో 
మొట్ట మొదటగా  నిలువడానికి
ఉరుకుల పరుగులు తీస్తున్నది.
ఇంకెంతో దూరములో లేము. 

భారతీయుడా మేలుకో భవిష్యత్తును సరిదిద్దుకో....... 
నేటి నుండే మొదలుపెట్టు 
నీతి నియమాలు కనిపెట్టు 
పట్టుదల,క్రమశిక్షణలు చేపట్టు. 


నగునూరి రాజన్న

No comments:

Post a Comment