Sunday, May 26, 2024

శకునం తేది : 30. 06. 23 శీర్షిక : ప్రయత్నించు .... రుజువు చేయి

 శకునం     

తేది : 30. 06. 23
శీర్షిక : ప్రయత్నించు .... రుజువు చేయి 

అనుభవాల తోటలో విహరించి వచ్చి 
పరిమళాల ప్రాణవాయువులు  ఆస్వాదించి 
ఊపిరి ఉగ్గబట్టుకున్నాక శకునమైనా 
సంప్రదాయమైన ఆచారమైనా చాదస్తమే... 

ఒకరికి బిడ్డయితే మనకు అమ్మ 
మనకు కూతురు  వేరొకరికి  భార్య 
మనకు మంచిది కొంతమందికి  చెడ్డది .... 
కొందరికి మంచయితే  మనకు చెడ్డది .... 

కాలమాన పరిస్థితులే కళేబరాలకు 
తగిన తొడుగునిచ్చి శరీర రక్షణలిచ్చినట్టు .... 
వారి వారి అవసరాలకు వారు పెట్టుకున్న 
నీతి నియమాలు నిక్కచ్చి ధర్మాలు ... 

విషయమేమిటో  పూర్తిగా తెలియని 
జీవరాశులు సైతం పాటించుకుంటాయి ... 
పక్షులు పుట్టుకతోనే వరసలో వెళ్తాయి ...
మనుషులకే అనేక శిక్షణలు బోధనలు .... 

సాక్ష్యం చూసావాంటూ  సంధిస్తారు 
సవాలక్ష ప్రశ్నల వర్షం....నీకేం తెలుసంటూ 
నిలదీతల పర్వం ....కుప్పమీదచ్చే 
తెప్పలాటలా....జవాబు తెలియని 
జమీందారులా....  

కాలు చేయి కదిపేది లేదు ... 
సరైన రీతిగా కష్టపడే పనిలేదు ... 
విశ్వాసం అంతకన్నా  లేదు .... 
అమ్మ మాటల్లాంటి ఆచారాల్లోనే 
అనుమానాలు వెదకడం మన హక్కు 
ఆ ఆటవికతలే  మనకు సొంతం .... 

శాస్త్రప్రమాణాలు లోతుగా 
తెలుసుకోము .... పరిస్థితులను 
అంచనా వేయము .... మిడి మిడి 
జ్ఞానాలతో కొట్టిపారేస్తాము ...
ఇంటివాణ్ణి కొట్టపోతే ఈ మీసమెందుకు .... 

చాలా వాటికి సరైన అర్థాలున్నాయి....  
అక్షరాస్యతలో నిరక్షరాస్యతలో 
నిదానించి సాంతంగా వివరించనంత 
మాత్రాన... సంధి కొట్టే ప్రయత్నమేనా .... 

మనసులో అనుకోగానే అన్నీ 
అమిరిపోవాలా ? ... కోరుకొగానే 
కోటి కళ్లముందుండాలా ? .... 
శారీరకశ్రమలు మానసిక శ్రమలు 
లేకుండానే శాస్త్రజ్ఞులకున్నంత 
తుల్యత  జ్ఞానం మాకు కావాలంటే ఎలా ?.... 

పాలల్లో వెన్న తీయాలంటే 
పరిశ్రమించాలి .... కాయ పండుగా 
మారాలంటే కాలం కలిసి రావాలి ... 
కార్బొలిక్ ఆసిడ్ వేయకుండా .... 

మనసు పెడితే మట్టి కూడా      
బంగారం చేయొచ్చు .... మతలబు 
ఏమిటో కనుక్కోవడానికి ప్రయత్నించు ... 
మాటికీ ముందు అన్నీ తప్పులు  పట్టేకన్నా .... 

అవసరాలను  అంచనా వేసుకుని 
కాలజ్ఞానివై కదిలిరా .... కావలసిన 
మార్చు చేర్పులు చేసుకో....జీవరాశిలో 
మానవాళి మిన్నని మరోసారి రుజువు చేయి  ..... 
 
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment