చిత్రకవిత
23-07-23
శీర్షిక: మారాజు… ప్రశాంత చిత్తము
నాగరికత నడకలు నేర్చుకుని
పారిశ్రామికతతో పరుగులు పెట్టి
సాంకేతికత సొబగులద్దుకున్నా...
వీడని నింపాది వీలుకాని అడుగులు ...
ప్రపంచం పరుగెత్తుతున్నది
హద్దులెరుగని ఆకాశం
సుద్దులు బోధిస్తూ గిఱ్ఱున తిరిగినా ...
భూ తల్లిని నమ్ముకున్న మారాజు ...
జీవితం కాచి వడబోసిన వటపత్రశాయి
దేనిమీద మనసులేదు
దేనిమీద మమకారం లేదు
అయినా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నోడు...
గొడ్డు గోదే ఆస్తి పాస్తులు
పచ్చని కంచే పరమాన్నం
వాటికి కడుపులు నింపడమే రాజాతనం
గోల్కొండను ఏలేయాలనే తపన లేదు …
సెల్లు ముచ్చట్ల సొల్లుల ధ్యాసలేదు
నెట్వర్కు రావడంలేదన్న చింత లేదు
డాటాప్లాన రవంత రంది లేదు
మిన్ను విరిగి మీద పడినా బాధలేదు...
ప్రశాంత చిత్తము పరిమళ భూషణము.
దోచుకోవాలని లేదు దాచుకోవాలని లేదు
తరాల కోసం తరలించాలని లేదు
ఊరందిరితో ఉసురు తీసేంత బాధలేదు
కడుపులో చల్ల కదలని కడుపు నిండిన నిండు జీవితం
నగునూరి రాజన్న.
No comments:
Post a Comment