గురు దేవోభవ
తేది : 05-09-2023
శీర్షిక : తపోసంపన్నుడు.
మాట రాని బీడు నేలల నోట కూడా
నాణ్యమైన అంకురాల వర్ణమాలను
నాటి...
పదాల సాలుతో వాక్యాల చేనును వనములా
పెంచి పోషించే తోటమాలి…
ఫరిడవిల్లిన పచ్చదనాల తోటలను
చూసుకుని బోసినవ్వుల పసిబాలునిలా
గుండె నిండా తృప్తి మూటలను కట్టుకుంటాడు…
తనువెల్లా తమకమై పులకరించే తపోసంపన్నుడు…
కొన్నిసార్లు మొండిబారిన గండ శిలలకు
సైతం సూటిగా గురిపెట్టి సహృదయంగా
స్పర్శించి..
మేటిగా సాన బట్టి మెరుగులు దిద్ది
మణి రత్నంగా తీర్చిదిద్దు తన్మయత్వంతో...
మురిపమైన ముందుతరాలకు
సంస్కృతి సంప్రదాయాలను బోధిస్తూ…
మొత్తంగా శూన్యంలోనుండి
సుందరమైన అనంతాల సృష్టికర్త …
అవసరాలకనుగుణంగా మారిపోతూ
తల్లిలాంటి ప్రేమలను పంచుతూ
తండ్రిలా గుంభనమై దండించగలిగేవాడు…
మనసులోని నిరర్ధక మలినాలను నిర్మూలించి
జ్ఞాన వెలుగులు సదా నింపేవాడు....
పూర్వ బంధ సంబంధమేమి లేకున్నా
పుణ్యసంపదల భూరి పరిమళాలను
పుష్కలంగా వ్యాపింపజేస్తూ
దేశ
పురోభివృద్ధికి పునాదిరాయవుతాడు..
నగునూరి రాజన్న
No comments:
Post a Comment