రాగ జలధి
తేది : 21-06-2023
శీర్షిక : రాగసుధలు
సంఖ్య : సహస్రాధికం
పరవశించగలిగే మనసుకు
పరికించిన గమక గోచరమే...
వీనుల విందయే పక్షుల కువకువం ....
తొలి సంధ్యల ఉషోదయపు భూపాళం ...
పచ్చని శోభలనుద్దుకున్న
తరువుల సాగే పైరగాలి ....
ప్రశాంతవనమున గలగలా
సాగే సెలయేటి ఝరుల సిరి ....
ఆవురుమంటూ ఆలమందలన్నీ
చేలవైపుగా చెంగున దూసుకెళ్తుంటే
తోలుతూనే ....అల్లన సాగే గొల్ల బాలుని
నోటంట వెలువడే పిల్లనగ్రోవి రాగసరాగాలు ...
సాయంకాలం సంధ్య వేళ
పరవశమై గూటికి పయనమైన
పక్షుల రవములు ....పశుసంపదల
వినసొంపైన అంబారావములు ....
పొదలలో ఉండి ఉండి పలకరించే
లయపూరిత కీచురాళ్ళు నిశ్శబ్దభేరి ....
పౌర్ణమి శోభల పండువెన్నెల్లో
నియమ నిష్టగా కదిలే కడలి కెరటం ....
మనసుపెట్టి వినగలిగితే
మౌనంలో కూడా వినిపించే
శ్వాసల ధ్యాసలు మరువలేని రాగసుధలు ....
మనిషిలోని గుండె చప్పుళ్ళు…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment