నాన్న గీతాలు
తేది :17-06-2023
శీర్షిక : మన గమ్యం ....
సహస్రాధికం
నాన్నంటే రెండక్షరాలే కాదురా
నాన్నంటే నిండు జీవితం సోదరా....
కడుపులోన మోయకున్నా
కళ్ళలోన నిలుపుకుంటడు....
క్షీరమై బొజ్జ నింపకున్నా
లవనమన్నమై పోషనిస్తడు .....
వేలు పట్టి నడిపించినా
వెనుదిరిగి రక్షించే కవచం ....
వీపు పైన ఆడించినా
గుర్రమై పోరు గెలిచే ధైర్యం ....
నాన్నంటే రెండక్షరాలే కాదురా
నాన్నంటే నిండు జీవితం సోదరా....
మొండికేసే గుర్రమైనను
రౌతుగా తాను దౌడు తీస్తాడు ....
రంది లేని మన పయనానికి
బండి చక్రం తానవుతాడు ....
కుట్టుగూసం నుండి మొదలై
కట్టుమీసం వరకన్నీ తానౌతూ ...
ఉండి లేని సంసార నావకు
సరంగై తాను సంచరిస్తాడు ....
నాన్నంటే రెండక్షరాలే కాదురా
నాన్నంటే నిండు జీవితం సోదరా....
మల్లెపూల తెల్లని అన్నం వెనక
మరువలేని వీపు గాయాలెన్నో ...
ఒంటి నిండా మనకు వస్త్రమైతే
కుంటి సాకుల మతలబులెన్నో ....
బాధ్యతల బందీలలో మునిగి
బ్రతుకు తీరునే మరిచిపోవు .....
మన ఉన్నత గమ్యాలకు తాను
కుంగిపోతూ గమన మౌతూంటాడు…
నాన్నంటే రెండక్షరాలే కాదురా
నాన్నంటే నిండు జీవితం సోదరా....
మన హారతి వెలుగులకు
తాను కర్పూరమైపోతాడు…
పిల్లల ఎదుగుదలలలో
తల్లివేరులా నిలుస్తాడు….
మన విజయబావుటాలకు
తాను పతాకశీర్షికల ప్రకాశమే….
మనసు వికసితమైతే
చిరు నవ్వుల పరిమళాలే…
నాన్నంటే రెండక్షరాలే కాదురా
నాన్నంటే నిండు జీవితం సోదరా....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment