చిత్ర కవిత
తేది -17-06-2023
శీర్షిక : కాలుష్య భూతపు కబంధ హస్తాలు
పచ్చ పచ్చని వృక్ష సంపదలతో
పరిమళించిన భూతల స్వర్గం
పదిలమయి నిలిచె కదా
పచ్చలహారమై పాలపుంతలో ....
సహజ వనరుల సంజాత
సహనశీలి మన భూమాత
సమశీతోష్ణ స్థితుల సలలితం
జీవరాశికాయే నాడు మూలం....
స్వార్థపు సాగు చింతనల నరజాతి
ప్రత్యక్ష పరోక్షాల పరితపనలతో
వృక్షజాతిని పక్షిజాతిని పగబట్టినట్టు
అనాలోచితంగా అడ్డు తప్పిస్తుంటే .......
కాలుష్య భూతపు కబంధ హస్తాలు
కల్తీల విషనాగులు తరిమి కొడుతూ
కరిమింగిన వెలగపండోలె హరితాన్ని
కబలిస్తుంటే... పెరుగుతున్న భూతాపం....
మరుభూమిని తలపిస్తున్న వైనం.....
భృకుటి ముడుచుకున్న భువికి భూతవైద్యమా?
పులిని చూసి నక్క వాతలలా కాకుండా
తాత్కాలికాలకు తాకట్టు పడిపోక
పురివిప్పిన శాశ్వతాల చింతనలు నింపుకో
నాటడమే కాదు నాలుగేండ్లు పోషిస్తూ ...
పతనమయిన పర్యావరణపు అవని నోట
జ్వరమానినా? ఆపు ఈ ఘోర కలి.....
అవని చేరే విష మలినాలను నిరోధించు
వివేచనుడవై....స్వచ్చమైన పచ్ఛదనాలను
ఛాయాచిత్రాలకు కాకుండా అచ్చంగా
ఆరంభించు స్వహస్తాల సాగుబడిగా
హరిత హారం.....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment