Wednesday, May 22, 2024

నాన్న చెప్పిన మాట తేది : 16-06-2023 శీర్షిక : మార్గదర్శకం ....

 నాన్న చెప్పిన మాట 

తేది : 16-06-2023
శీర్షిక : మార్గదర్శకం .... 

చదువు శారేడు బలపాలు దోశెడన్నట్టు
వానాకాలం ఎండాకాలం చదువులు.....  
అంతంత మాత్రమే అబ్బుకున్నా 
ఆటల్లో మాత్రం ఆరితేరిపోయేవారం .... 

అలసిపోయిన తనువులను చుట్టి
వెన్నెల అరుగులమీద ఆరబెట్టుకుని 
చల్లగాలికి మేమంతా  నిగ్గ దీసుకుని 
కళ్ళు నలుచుకుని పండుకుంటుంటే.... 
  
భానునికి ఆహ్వానాలు పంపే పక్షుల 
కువకువలతో లేచిపోయేది  అమ్మ మాత్రం….
నిరంతరం నిలువెత్తు సూచనలతో 
నిరక్షరాస్యతలను సైతం మరిపించేది ..... 

చీకటి పొద్దును ఒంటికి చుట్టుకుని 
పొలం పనులకెళ్ళేది  నాన్న .... 
చీటికిమాటికి మందలించక పోయినా ... 
ఆయన కష్టమే మాకు దివిటీ వెలుగు ... 

అన్నయ్య పెళ్ళికి అత్తవారి బట్టల 
విషయంలో సూచించిన సూక్ష్మం .... 
సాటివారి కష్టం మూటకట్టొద్దు అన్న 
ఆయన మాట అడుగడుగునా గుర్తుకొస్తుంది .... 

ఇవాళ్టి నీ కొనుగోళ్లు నిర్వహణలు 
జీవితాంతం పాటించగలిగేవై ఉండాలని 
చెప్పిన మాట మా పిల్లల పెంపకం వరకు 
మార్గదర్శకమై మన్నుతున్నది .  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment