పగటి నిద్ర
తేది : 17-06-2023
శీర్షిక : టానిక్ ....
ఆవురావురుమనే ఆకలైనా
గొంతెండిపోయే దూపలైనా
రోజు వెలుగులలో రోషించేవే ...
చీకటిని వెంటేసుకునే నిద్రమ్మ
చీకటి వెలుగులైనా తేడాలేదనే
శ్వాసల ఊసుల జాడలు ....
రోజంతా శ్రమశీలతలకు చిక్కి శల్యమైన
తనువులు అలసిపోతే తగులుకునే
రాత్రి నిద్రమ్మ మాత్రం పునః శ్రీకారాలకు
పుణ్యమూర్తిలా టానిక్కై పోతుంది .....
పగటి నిద్రలు పాపాయిలకు వరం ...
బహు దొడ్డగ ఎదుగుదలలకు కారకం ...
వయో వృద్దులకు తప్పని తిప్పలు ....
అప్పుల కుప్పలా ....
నెత్తిమీద బరువులా పని చేసుకుని
పొట్ట పోసుకునే పనిమంతులకు
పగటి నిద్ర పగబట్టిన శత్రువే ....
అలసత్వాలకు ఆలవాలమై
మత్తుమందులా కమ్ముకొచ్చి
నిత్య శ్రమలను దోచుకుంటుంది ....
చేసుకున్నవారికి చేసుకున్నంతలా
పని మధ్యలో ప్రసాదంలా... కుదిరిన
వారికి కునుకు పడితే మాత్రం కుందనమే ...
మోతాదైతే మోహనమేలే ....
కునుకుగా తీస్తే టానిక్కే
అతి సర్వత్ర వర్జయేత్ ... లాగా
గంటల కొద్దీ పగటి నిద్రలు శుంఠలుగా
మార్చి అనారోగ్యాలను అంటగట్టు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment