Monday, May 20, 2024

వలస పోయిన మందహాసం తేది : 29-03-2023 శీర్షిక : కలుపుగోలు పక్షుల కిలకిలారావములు

 వలస పోయిన మందహాసం

తేది : 29-03-2023
శీర్షిక : కలుపుగోలు పక్షుల కిలకిలారావములు 
సంఖ్య : సహస్రాధికం   

ఏడవలేక నవ్వినట్టుంది యవ్వారం ... 
నీకు ఒక పక్కయితే ... నాకు రెండు 
వైపులా అన్నదట .... ఎవరిని 
కదిలించినా  ఇవే ముచ్చట్లు .... 

సౌకర్యాలు పెరిగితే సంతోష పడాలె 
కానీ ...పరధ్యానం పెరిగి పరేషానే 
వచ్చింది ... పలకరింపులు కరువై 
ఆత్మీయతలు మాయమైనాయి .... 

అప్పుడప్పుడు ఎదురుచూస్తుంటాను 
అందిపుచ్చుకున్నట్టుగా అనురాగ 
వర్షం కురిసి తడిచి ముద్దై పోవాలని.... 
చూపులు ఎద్దేవా చేస్తాయే తప్ప కానరావు 
కనుచూపు మేరలో కమ్మని దరహాసం ... 

పారిశ్రామిక ప్రగతి పగబట్టిందో ... 
సాంకేతిక అభివృద్ధి సంధి కొట్టిందో ... 
మానవత్వపు ఛాయల కరువుకాటకాలను 
పోషిస్తూ నెర్రెలూనుతున్నది .... 

అవసరాల వరకే మాటలంటూ 
రంగు కాగితాల చుట్టే రాట్నంలా 
తిరుగుతున్న ప్రపంచంలో 
వలస పోతున్నది మందహాసం .... 

మనిషన్నాకా కూసింత కళాపోషణ 
ఉండాలని ఓ మహానుభావుడన్నట్టు ...  ... 
భూపాలరాగాలను గుర్తుచేసే కలుపుగోలు 
పక్షుల కిలకిలారావములలా ... ఉంటే 
బాగుంటుందేమో .... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment