అడవి గోడు అరణ్యం పాలు
తేది:12-04-2023
శీర్షిక : తిలా పాపం తలా పిడికెడు ...
ఒకప్పుడు ....
పచ్చలద్దుకున్న పర్వత తోరణాలతో
జీవనదులను ఆనుకున్న అరణ్యాలతో
బీడు భూముల జాడ తెలియనీయని
దట్టమైన కీకారణ్యాలతో విరిసిన తావులు
క్రూరమృగాలు నిలయాలైతే ....
ఒర్రెలు వాగులు వంకలనానుకుని పచ్చని
గొలుసులేసుకున్న పల్లె ముత్తైదువులు
కుహు కుహుల పక్షుల కూని రాగాలతో
నక్కలు తోడేళ్ళు నడయాడి .... ఎలుగుబంట్లకు
కోతులు కొండముచ్చులకు ఆలవాలం.....
ఇప్పుడు .....
ఆరోహణ క్రమపు జనసాంద్రతలో ....
గుణింతాలవుతున్న స్వార్థభావనలో ....
వెరసి సామూహిక ఆస్తులైన ఆటవిక
సంపదలన్నీ అమ్యామ్యాల పర్వం .....
సత్యం కళ్ళు మూసుకుంటూంటే
ధర్మం దారి తప్పి పోతూంటే
న్యాయం కళ్ళకు గంతలు కట్టుకోగా
ధవళవస్త్రాల కనుసన్నలలో
అధికారదర్పాలన్నీ సాగిలబడి ....
పచ్చపచ్చని అడవులనన్నింటిని
పిచ్చిపిచ్చిగా మేసి ఆవురుమన్నాక ....
కొండలన్నీ పిండి చేస్తూ మింగి త్రేన్చి
ఇసుక క్వారీలను నంజుకున్నాక...
సెలయేటి నీటి పాయాలేం ఖర్మ ...
జీవనదులు ... డాముల... నీళ్లు కూడా
చాలని తత్వమే ఆవరించుకున్నాక ....
అనుయాయులకు ఒప్పవుతూ
మాట్లాడితే తప్పవుతూ .... ప్రజలంతా
చేష్టలుడిగి నిశ్చేష్టులై పోతుంటే ....
తిలా పాపం తలా పిడికిడై ... తరాల
తలరాతలను మార్చేస్తున్నది .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment