Monday, May 20, 2024

మనసున్న మనిషికి సుఖము లేదంతే ... తేది 28-04-23 శీర్షిక : స్పృహ ఉన్నంత సేపు ....

 మనసున్న మనిషికి సుఖము లేదంతే ...

తేది 28-04-23
శీర్షిక :  స్పృహ ఉన్నంత సేపు .... 
సంఖ్య : సహస్రాధికం ... 

స్పృహ ఉన్నంత సేపు సుందరమే ... 
జీవనది చెలిమెలా ఊరుతుంది 
భావఝరి వసంతమై పొంగుతుంది 
ఒక్కసారి ఒడిసి పట్టుకున్నామా 
వదిలిపెట్టాలని మనసు రాదు .... 

కుసుమ లతలై అల్లుకొంటుంది
పరిమళాలు వెదజల్లుతుంది 
ఆ ఘుమఘుమలకు అలవాటైతే 
విడిచిపెట్టమంటే మనసు కష్టం ... 

మృదుమధురమై పరవశించు 
పూసుకున్న గంధంలా శోభించు 
తేనె మధురిమల జ్ఞాపకాలతో 
మళ్ళీ మళ్ళీ అదే దారికి అడుగుపడు ... 

కానీ ఏమిటో కాల మహిమ అనుకుంటా 
మనుషుల మధ్య మసులుతుంటే 
మసక చీకట్లో నడిచినట్టుంటున్నది 
అనుమానం పెనుభూతంలా ఆవరిస్తుంది .... 

ప్రతి మాటలో మడత పేచీలు 
పెడుతూ మంచిని కంచె దాటించి ... 
చెడును మాత్రమే చెట్టాపట్టాలేసుకుని... 
మనిషిని సాంతంగా స్కానింగ్ చేస్తుంటే... 

సంశయాల సంచులే కనబడుతున్నాయి  ....
మంచిని పరామర్శించాలన్న ఆలోచన  
కొట్టుమిట్టాడుతూ  ఆత్మసాక్షులు కూడా 
అంతర్థానమై పోతున్నవి .... 

మనిషిని చూడగానే ... మనసు పుస్తకం 
విప్పుకోవాలి ...అందమైన బంధమేమి 
లేకపోయినా ... ఆత్మీయంగా బంధుత్వంతో 
పిలుచుకునే పల్లె పరిమళాలు విచ్చుకోవాలి.... 

సాంకేతికతలు సంధికొడుతున్నాయో 
పశ్చిమోని పాపపు కన్ను పడిందో ... కానీ 
సుఖము తగ్గిన సుందరయ్యలే  అందరు .... 
మనసు లేని మందమతులైపోతున్నారు ..... 
స్పృహలు తప్పి చుట్టు తిరుగుతున్నారు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment