దర్పణం చిత్ర కవిత
తేది : 21-05-2023
శీర్షిక : కరములోడ్చి కాలాన్ని వేడుకొనుడే…
కాలమెప్పుడైనా సస్పెన్సు థ్రిల్లరే
కలుపుకుని సాగిందా కర్షక సంజీవనియె …
కన్నెర్రజేసిందా కసిదీరా కాటేసే కలనాగే
అప్పుడప్పుడు అప్పుతచ్చోలే కాటగల్సు …
కారణమేంటని ఆరా దీస్తే మాత్రం
ఖచ్చితంగా కలిమాయలనే సమాధానం ..
కనపడ్డ అనుభవజ్ఞుల మానసం
కబోది బతుకులే కాలప్రవాహంలో ...
కాలంగాని కాలంలో కవాతు చేసే
గాలి వాన గావుబట్టి చెట్ల మెడలను
విరిచేసి... పంటపొలాలను రక్కేసి
కత్తి సాములా విరుచుకుపడ్డ వీర విహారం...
ఎదురెళ్లి నిరోధించే శక్తి గానీ... సర్దుకుని
సాగనంపే భక్తి గానీ ఏ ఒక్కరికి లేదు…
కాదని వాదించే కరాఖండి ధైర్యం లేదు
అవునని ఆదరించే ఆత్మీయ ప్రేమ లేదు ...
కాలానికి తలవొగ్గి కాలు కదపడమే
బడబాగ్ని బలానికి బలి కావడమే
అతీత శక్తికి ఆహుతి అవ్వడమే
భక్తితో తలచి బతుకులీడ్వడమే ...
కరములోడ్చి కాలాన్ని వేడుకొనుడే…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment