నిద్రలేమి
తేది : 20-05-2023
శీర్షిక : మోతాదు మించని నిద్ర.
నాగరికత నడకలలో అడుగులేసి
పారిశ్రామికీకతలతో పరుగుపెట్టి
దివారాత్రులు దిగిపోకుండా ముప్పేట
ఉత్పత్తుల ఊసులతో మురిసిపోతూ …
మూడేసి షిఫ్టులలో ముచ్చటపడి
పనిచేస్తుంటే నిద్రా దేవి పలకరించక
నీరసాలను పరిచయం చేసి.. నిలువెల్లా
అనారోగ్యాలను అల్లుకొనును కదా….
సాంకేతిక విప్లవం చంకలో దూరాక
డబ్బు జబ్బు ఊపిరాడనీయక చుట్టుముట్టాక
మనిషి నిర్వీర్యుడై పక్కవారినే కాదు..
తనను తాను పట్టించుకున్న దాఖలాలు లేవు .
అత్యవసరాలలో ఆది మూడవది
ఆకలి దప్పులు తీర్చుకున్నాక ...
ఆరోగ్యాలను అల్లుకునే రహస్యం
అవసరశ్రేణిలో నిలుచు జీవరాశికి....నిద్ర
అలసట తోటలో విశ్రమించి
కలల సౌధములో కునుకు తీసే
కమ్మని నిద్రలో కరిగిపోయే మనిషికి
కనిపెట్టుకునే ఆరోగ్యాల చెలికాడు…
మోతాదు మించని నిద్ర…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment