ఇదీ .... నా ఆయుధం
తేది : 20-04-2023
శీర్షిక : సర్దుకోవడం ....
కవిత సంఖ్య : సహస్రాధికం ....
బుద్ధినేర్చిన దగ్గరనుండి
సద్ది ముల్లెలా అంటిపెట్టుకున్న
అలవాటు ... జుమ్మని కళ్ళు మూసుకుని
కిమ్మనకుండా కాగితంపై కెలుకుడు ....
సంతలో జరిగే వింతలన్నీటికి
కొంతయినా సమాచారాన్ని సేకరించి
రమణీయమైన నొప్పించని రీతిలో
రామబాణంగా ఎక్కుపెట్టడం ....
అనువు కాని చోట అధికులం కాదనిపిస్తే
అప్పుడప్పుడు చప్పుడు చేయకుండా ...
బాధ్యతల బందీలలో భుజం ఆనించాల్సివస్తే
అవసరమైనప్పుడు హడావుడి చేయడం ....
ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్నట్టే
ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటే ....
సమయానుకూలంగా స్పందించగలిగితే
సమస్యలన్నీ సమసిపోతాయి ....
మరుపన్నది మానవ సహజంలా
రుణాత్మకాలను కుమ్మరించేస్తూ ....
ధనాత్మకాలను పోగుచేసుకుంటూ పోతే
దండి హాయి మనసుకెప్పుడూ ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment