Monday, May 20, 2024

అభినయం తేది : 20-04-2023 శీర్షిక : భావాంకురాలు

 అభినయం

తేది : 20-04-2023
శీర్షిక :  భావాంకురాలు 

అనువైన రూపాలు  ఆంగికం ... 
సరిపోలు గాత్రాలు  వాచకం ... 
చక్కని హావభావాలు  అభినయాలతో 
కఠోర దీక్షా పట్టుదల పరిశ్రమల పెట్టుబడులు  
కలిసి చెట్టాపట్టాలేసుకుంటే 
తిరుగులేని  నటనా సామర్థ్యమే .... 

నాగరికతల నడకలలో అడుగులేసి 
నడకలు నేర్చిన నాటికలు ...నాటకాలు... 
పరుగు లంఘించుకున్న వెండితెరలు 
ప్రతిదినం అంటిపెట్టుకున్న బుల్లిపెట్టెలు ... 
అసలైన మైలురాళ్ళు అభినయంలో .... 

శివ తాండవం లాంటి చిచ్చరపిడుగులు 
ఏకపాత్రాభినయమంటి  గంభీరతలు 
మూకాభినయంలాంటి ముగ్ధమోహనాలు 
అదనపు సొబగులు అద్దినవి అభినయానికి .... 

గుండెలు పిండి కంటనీరు పెట్టించేవి 
కొన్నయితే .... లోకం మరిచిపొయి 
ఆకాశంలో తేలిపోయి  మనసుకు హాయి 
గొలిపే మధుర అనుభూతులు మరికొన్ని.... 

అక్షరాస్యతల కన్నా సూటిగా .... 
అపూర్వమైన మేటిగా ... గుండెల్లో 
గుచ్చుకుని ....భావాంకురాలను 
బలంగా నాటి పండించగల సత్తా ..... 

అన్నింటికన్నా బలమైన అభినయం 
నమ్మి నానపోసుకుంటే ... పుచ్చి బూరలైనట్టు 
ఎన్నికల ముందు ఎండబోసుకున్న 
వరాల ముల్లెలను విప్పితే తెలుస్తుంది 
దండిగా  నిండిన  ధవళ వస్త్ర దారుల్లో 
నిఖార్సైన నిజాయితీల అభినయపు కొలతలు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment