కథా వేదిక
బాలసాహిత్య మాసం కథ (2)
అంశం: సాహసం
తేది: 02-04-2023
శీర్షిక : సమయ స్ఫూర్తి
రాము, భూషణం వరసకు బాబాయ్ అబ్బాయ్ అయినా ఒక ఈడు వారు ఒకే తరగతిలో చదువుకుంటున్నారు . ఇద్దరు కూడా చదువులో బాగా రాణించేవారు . వాళ్ళ తరగతి మాస్టార్లు మెచ్చుకునేవారు. 6 వ తరగతి నుండి 10 తరగతి వరకు పక్క గ్రామానికి వెళ్లి చదువుకునే రోజులవి . పిల్లలు తిరుగు ప్రయాణంలో చెట్లెక్కుతూ .... గుట్టలెక్కుతూ ... ఆడుతూ పాడుతూ ... చెట్లమీద దొరికిన కాయలు పండ్లు తింటూ సరదాలన్నీ తీర్చుకుంటూ ఇళ్లకు చేరుకునే వారు ... వాళ్ళ ప్రయాణంలో చిన్న వాగు దాటవలసి వచ్చేది ...మిగతా కాలం పెద్దగా నీళ్లు ఉండవు కానీ వర్షాకాలం వచ్చిందంటే మాత్రం అప్పుడప్పుడు దాటడం కష్టంగా ఉండేది .
రాము ఆ మధ్యనే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లిన రోజులలో వా ళ్ళ మామయ్య సహకారంతో ఈత నేర్చుకున్నాడు .. అదీ కాకుండా ప్రతి రోజు వెళ్లివచ్చే దారి కాబట్టి దారంతా సుపరిచితమయి, వాగు దాటే సమయంలో భూషణంను పట్టుకుని ధైర్యంగా అవతలి ఒడ్డుకు చేర్చేవాడు .. అలా వాళ్ళు రోజు మిగతా పిల్లలు ముందు వెళ్లినా తదుపరి వెళ్లినా ... వీళ్ళు మాత్రం ఎప్పుడూ కలిసివెళ్ళేవారు . సంతోషంగా కాలం గడిచిపోతుంది .
వాళ్ళు 8 వ తరగతిలో ఉన్న రోజుల్లో వాళ్ళ ఊరివారంతా కలిసి శ్రావణ మాసంలో వనభోజనాలకు వెళ్లే ఆచారం ప్రకారం ఆ సంవత్సరం కూడా ఒక ఆదివారం నిర్ణయించుకుని చెరువు గట్టు పైనుండి వెళ్లి.... ఒక కాలువ దాటి మామిడి తోపులోకి వెళ్లడానికని బయలుదేరారు .
తొలకరితో తడిసి ముద్దయిన అవని మాత పచ్చంచు చీర కట్టుకున్న ముతైదువలా చెట్లన్నీ తలారా స్నానం చేసినట్టు శోభాయమానంగా ఉండడంతో పిల్లలంతా కేరింతలతో బయలు దేరారు. పెద్దవాళ్లంతా ముందుగా కాలువను పరిశీలించి ఎడమ వైపు లోతు తక్కువ ఉన్నదని, కుడివైపు కొంచం లోతు ఎక్కువ ఉన్నదని చెప్పి అందరిని ఎడమవైపు మీదుగా రమ్మంటూ, వాళ్ళు ముందుగా నడిచారు.
మాటల్లో పడిపోయిన పిల్లలు మాత్రం ఒక అడుగు వెనక నడుస్తున్నారు. పెద్దవాళ్లు చెప్పిన మాట కూడా సరిగ్గా వినిపించుకున్నట్టుగా లేదు. అందరూ కాలువలోకి దిగారు.
పైనుండి పెద్దవాళ్లంతా గట్టిగా చెబుతూనే ఉన్నారు "ఎడమపక్కంటూ " . కానీ పిల్లలది అదే తంతు చెవికెక్కించుకోక నడుస్తూనే ఉన్నారు.
ఇంతలో భూషణం వాళ్ళ తమ్ముడు మార్కండేయ అనుకోకుండా లోతువైపు అడుగేసే సరికి .... నీళ్లలో గొంతువరకు మునిగి పోయాడు. ఆ పిల్లల్లో రాము కూడా ఉన్నాడు కాబట్టి ... ధైర్యంగా మార్కండేయ చొక్కా దొరకబుచ్చుకుని బయటికి లాగేసాడు . అంతే ... అందరు ఒక్కసారి పెద్దగా ఊపిరి తీసుకున్నారు ..
అప్పుడు అందరూ రాము సమయస్ఫూర్తిని మెచ్చుకుని అభినందించారు . ఈతలో నైపుణ్యం ఉండడంతో ... సమయస్ఫూర్తిగా కదిలి సాహసం చేయగలిగాడు. వాళ్ళ వనభోజన కార్యక్రమం అంతా కూడా చాలా సంతోషంగా ముగిసింది . తదుపరి ఒకరి ద్వారా ఒకరికి ... ఊరి వారందరికీ తెలిసి ... అందరూ రాముని మెచ్చుకోసాగారు. రాము ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment