మోహన గీతాల పరవశం
తేది : 18-05-2023
శీర్షిక : రాధామాధవీయం
సంఖ్య : సహస్రాధికం
కళ్ళు తెరిచింది కారాగారమైనా
కారణ జన్ముడు మన కన్నయ్య !
అష్టమ అవతారం శ్రీ మహా విష్ణువుకు
అష్టమి తిథి రోహిణీ నక్షత్రయుక్త జననం ...
సుందర లీలలు వందల కొలది
పాలు మీగడల వెన్న దొంగగా
పడతుల వస్త్రాపహరణలు చేసినను
ధర్మ పాలనలో భాగంగానే .....
అల్లరి పనులెన్నో చేసి
కోకొల్లల మహిమలతో గొల్లభామల
గోపెమ్మల మనసులు దోచినా
రాధా మాధవుడే రమణీయంగా ....
గోధూళివేళలో గోపెమ్మల
ఎదురుచూపులు .. మోహన
గీతాల మురిపమై వచ్చే చిలిపి
చేష్టల శిఖి పింఛమౌళి రాకకై ....
మంద్ర గమనమున సాగుతున్న
యమునా తటి .... ఉన్నట్టుండి
అలలు ఉవ్వెత్తున ఎగిసిపడె
పిండారబోసిన వెన్నెల రాత్రి ....
స్వార్థమెరుగని సాన్నిహిత్యం
మోహమెరుగని ప్రేమతత్వం
స్వామి సౌఖ్యమే పరమావధిగా
అమలిన శృంగారం ఆమె ప్రాణం ....
తనకు తాను అర్పించుకుని
శూన్యస్థితికి చేరువై ... స్వామియే
తనను పలవరించేంత ప్రేమ
పంచిన పెన్నిధి రాధమ్మ ....
ఆచంద్రతారార్కమే ఆ కన్నయ్య
కథలు ... మోహన గీతాల
పరవశమే ఒకటొకటిగా
మధురమై ... సుమధురమై ....సుందరమై ...
జగతికి చాటిన రాధామాధవీయం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment