Monday, May 20, 2024

పిసిఓ డబ్బా ఫోన్ చిత్ర కవిత తేది: 15-04-2023 శీర్షిక : ఒక్క రూపాయికే ....

 పిసిఓ  డబ్బా ఫోన్  చిత్ర కవిత 

తేది: 15-04-2023 
శీర్షిక :  ఒక్క రూపాయికే .... 

బంగళాల్లో బస చేసిన దూరవాణి 
బజారుకెక్కి అందరికి అందుబాటయ్యింది .... 
కిళ్లీ కొట్టుకు ... బడ్డీ కొట్టుకు 
బతుకుదెరువులో  వేన్నీళ్ళకు 
చన్నీళ్ళయి వెసులుబాటయ్యింది .... 

ఒక్కరూపాయికే ఒడువని ముచ్చట్లు 
పెట్టి.... బంధాలను అనుబంధాలను 
బలోపేతం చేసింది .... అందరిని 
తన చుట్టూరా తిప్పుకున్నది .... 

పల్లె పట్నం తేడా లేకుండా చేసి 
అందరికి చేరువయ్యింది ... 
పిల్లాపాపలు కాలేజీలకెళ్లినా 
పనులమీద పట్నమెళ్లినా .... 
పలకరించి పరిమళాలు పంచి 
సంతోషాలను నింపింది .... ఆనాడు…

సునామీలా దూసుకొచ్చిన తైతక్కలాడి 
అరచేత విశ్వం సెల్ ఫోన్ల  ... తెరలవాణి  
హవాతో... అంతా కుక్కిన పేనై నక్కి నక్కి 
దాక్కుని గుక్కపట్టి ఏడుస్తున్నాయి ... 

నడకలు నేర్చిన  నాగరికతల 
గమనంలో మార్పు సహజమని  
మనసారా నమ్మి మిన్నకుండిపోయింది ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment