Monday, May 20, 2024

రాజ్యాంగ స్పూర్తి. తేది -14.04.23 శీర్షిక : అనుభవసారం మూటకట్టాలి…

 రాజ్యాంగ స్పూర్తి.  

తేది -14.04.23
శీర్షిక : అనుభవసారం మూటకట్టాలి… 
సంఖ్య : సహస్రాధికం.  

మేలిమి సూత్రాల మేలు కలయిక 
పన్నెండు షెడ్యూళ్లతో పదిలమైనది
పవిత్రమైన మన భారత రాజ్యాంగం …
బాబాసాహెబ్ అంబేద్కర్ రచయితం… 

సమసమాజ స్థాపనలే ధ్యేయంగా 
సామాజిక దూరాలను కలుపుటకు 
ఆర్ధిక భారాలను అధిగమించుటకు  
రాజకీయ పాలనలు అందించుటకు 
న్యాయాలకు సౌభ్రాతృత్వపు పరిమళాలు 
అద్దుటకు ... సగర్వంగా ….. 

పకడ్బందీగా అన్నిటిపై పట్టుబిగించినా 
ఆర్టికల్స్  ఎన్ని పొందు పరిచినా  … 
ఇప్పటికీ పేదోడికి పాలన కలగానే మిగిలి ... 
పెత్తనమంతా కోటరీలలో కొట్లాడుతున్నది ...   

అవాక్కయ్యే లక్షణాల ఆనవాళ్లే ఇంకా కొన్నీ ... 
అటెండరుకైనా అక్షరజ్ఞానం కావాలి  కానీ ...
పాలకులకు పట్టింపులు లేవంటూ  
అర్హతలను ఇక్కడ అటకెక్కించారు .... 

కౌన్సిలర్లకైనా కరెన్సీ ఖర్చులు కోట్లలో… 
కాకి లెక్కలతో ఖజానాలన్నీ కదిలి పోతుంటే….
కాదని నిలువరించలేని కబోదుల 
అధికార గణాలు…ప్రజా సమూహాలు…. 

ప్రకృతి సంపదల పంపకాలతో
కుటుంబాలన్నీ కుంభకోణాల నిందలు 
మోస్తుంటే....పార్టీలన్నీ ఫలహారాల కోసమై
నిరీక్షిస్తుంటే ....కంచె చేను మేసిన చందంగా
రక్షణలే భక్షణలై త్రేన్చుతున్నవి…. 

పాలన పగ్గాలకన్నా ముందుగా 
దేశరక్షణలో దేహసేవలందించే 
షరతులు చేర్చి... మాతృదేశమంటే 
మహిమాన్వితమని సాక్ష్య పరచాలి ... 

అహం బ్రహ్మాస్మి... పరకాయ ప్రవేశం 
లొసుగుల దండలో పూలన్నీ మాయం…
అనుభవాల సారం మూటగడితేనే
అతి శక్తి వంతమౌ మన  ప్రజాస్వామ్యం ...

అందుకు సాయంగా .... 
ఊరికో మహాత్ముడు... ఉరికొయ్యను ముద్దాడిన 
భగత్ సింగులు.. దేశమంటే దేహమన్న కలాంలు 
మళ్ళీ  పుట్టాలేమో...  మన రాజ్యాంగం
పవిత్రతను పదిలపరచి కాపాడేందుకు.... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment