మాతృ గేయాలు
శీర్షిక : అమ్మెంత గొప్పదో
తేది :13-05-2023
అమ్మెంత మంచిదో
అమ్మెంత గొప్పదో …
ప్రాణమైన పోసుకోని పసిగుడ్డును సైతం
పదిలంగా చూచుకొను....
కడుపులోన పరిచేసు కండరాల
కడుమెత్తని పొత్తిళ్ళను.....
కడుమెత్తని పొత్తిళ్ళను.....
గట్టిగ లేచి కూర్చుండే సమయంలో
పట్టు దొరక పోయినా …
పొట్టచూసి మురుసుకుని ముసిముసిగా
పుట్టెడు దీవెనలిస్తుంది...
పుట్టెడు దీవెనలిస్తుంది...
అమ్మెంత మంచిదో
అమ్మెంత గొప్పదో …
అడుగు తీసి అడుగేసే సమయంలో
ఎగుడు దిగుడు దారైనా
పదిలంగా పసికట్టు పొంచిన ప్రమాదం
అల్లంత దూరాన అలవోకగా…
అల్లంత దూరాన అలవోకగా…
కాళ్ళు చేతులాడిస్తుంటే
కడుపునిండ తినలేక …
వేవిళ్ళతో సతమతమై
వేయి కళ్ళ ఎదురుచూపు ...
అమ్మెంత మంచిదో
అమ్మెంత గొప్పదో …
ప్రపంచాన పరిచయించ
పృథ్విపైన పదిలపరచ…
పక్కను కూడ దొర్లించలేక
నిక్కబొడుచు రోమాలు...
సాధారణ నొప్పులతో నువు
ఒప్పుల కుప్పనుకుంటే….
నరకమే అమ్మకింక
ఏబదంతల నొప్పులతో…
అమ్మెంత మంచిదో
అమ్మెంత గొప్పదో …
అడ్డంగా పొట్టచీల్చి
ఆపరేషన్ కు అనుమతిస్తే…
అవుతావు నువు జననం
అమ్మకవును పున్నామ నరకం ….
రుధిరం స్తన్యంచేసి
మధురంగా నింపుతుంది ...
రోజుల పాపాయిని తాను
రాజులాగా పెంచుతుంది....
అమ్మెంత మంచిదో
అమ్మెంత గొప్పదో …
పసితనాన పాలుతాగి
ఆకతాయిగా జుట్టుపీకితే…
పట్టు తాను విడిపించి
గుండెలకు హత్తుకును ....
బాలారిష్టపు బాధలకు
చిన్నపాటి నలతలకు
చింతలతో అంగలార్చు
చిగురుటాకై వణికిపోవు ...
అమ్మెంత మంచిదో
అమ్మెంత గొప్పదో …
చిన్ని చిన్ని మాటలను
చిద్విలాసమై బోధించు
బుడిబుడి అడుగులను
బుద్ది మాటను నేర్పించును…
చంటితనం తుంటరిగా
ఒడిలోనా ఒంటిపైనా
ఒకటి రెండు చేసినా
భూజాతల ఓర్పులే ....
అమ్మెంత మంచిదో
అమ్మెంత గొప్పదో …
చందమామ చూపించి
గోరుముద్ద తినిపించు ...
జోలపాట వినిపించి
బుజ్జి నిద్ర నందించు...
జ్ఞానమెరుగని జీవితాన
జీవగడియారంగ మారిపోయి…
గడియకొక్కసారిగా
జవజీవాలకు మెతుకౌతుంది ..
అమ్మెంత మంచిదో
అమ్మెంత గొప్పదో …
యుక్తవసు వచ్చువరకు
బతుకుబండి నడుచువరకు …
ప్రయోజకులను చేసాక
పరవశమై మురిసిపోవు ....
పదిలంగా కడుపుకట్టి
పదిమందిని సాకును…
పస్తులుండైనా తాను
పరవశించి మురియును….
అమ్మెంత మంచిదో
అమ్మెంత గొప్పదో …
ఆయువుతో పాటుగా
ఆస్తులు అంతస్తులు …
ఆత్మీయత అనురాగం
అన్నీ తాను పంచి ఇచ్చు…
అవసానంలో మనమంత
సూటిపోటి మాటలన్నా…
చూసి చూడనట్టుండు
మాట బైటపడనీయక….
అమ్మెంత మంచిదో
అమ్మెంత గొప్పదో …
మధురమైన తేనియలా
మమతల పొదరిల్లులా
నగునూరి రాజన్న
No comments:
Post a Comment