కలం చిలికిన కవిత్వం
తేది 12-04-2023
శీర్షిక : నిఖార్సయితే ....మానవత్వమే
సంఖ్య : సహస్రాధికం ....
రాశులయిన రాగద్వేషాలకు
భావావేశభరితం చేసుకుని
తగిన పదాలతో మాలలు కూర్చి
అర్థవంతపు వాక్యాలను ఆరబోస్తుంది ....
ప్రకృతిలోని పరవశాలనే కాకుండా
కాలగమనాలలో కదిలిపోతున్న
కథా కమామీషులను కళ్ళకు కట్టి
కదం తొక్కించగలిగే తత్వమే .....
ఒక్కొక్కసారి ఎడారిలో తడారిన
గొంతుకలకు ఒయాసిస్సులా ...
అండదండలెరుగని అభాగ్యులకు
చలువపందిరి నీడలా నిలుస్తుంది ....
ప్రశ్నించే గొంతుకలకు పాళీలా ....
నిలదీసే తత్వాలకు చర్నాకోలలా ....
అన్యాయాలకు ఆనకట్టలేస్తూ ....
అక్రమాలకు చెక్ పెడుతూ ఝుళిపిస్తుంది ....
నిఖార్సైన నీడలలో నిలిచిన కలం మాత్రం
మంచితనాలకు మారాజై
ఆదరించే మానవతలకు ఆపన్నమై
అనురాగాలను కుమ్మరిస్తూ
ఆత్మీయతలను జోడిస్తుంది ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment