కాలం నేర్పిన కాఠిన్యం
తేది 12-04-2023
శీర్షిక : మరుపు మానవ సహజం
సంఖ్య : సహస్రాధికం ....
మల్లె పందిరి నీడన
అపురూపమైన ఆత్మీయతల
కుసుమ పరిమళాలే ...
అరమరికలు లేని అనురాగాల
విందు వినోదాలే ....
జీవితమంతా రంగు రంగుల
హరివిల్లే ... సప్తవర్ణశోభితంలో
భద్రమైన మచ్చలేని తెలుపువర్ణం
మాలిన్యమెరుగని వెలుగులే ....
పురిటి నుండి పుట్టి పెరిగి
పునీతమైన జీవితాలే ...
అందరూ ఆ పరిమళాలను
ఆస్వాదించినవారే ....
తడబడిన ప్రతీసారి తనువును
హత్తుకునే మల్లె తీగలే .....
భరోసా మంత్రమేసి బాధలను
మైమరిపించిన దాఖలాలే ...
కాలగమనంలో కకావికలమైన
పందిరితో ....కల చెదిరి....
కల్లోలమై....మతి భ్రమించేంత
మరువలేని మానసిక ఒత్తిడి....
కాలం నేర్పిన కాఠిన్యంలో
నిత్యకర్మల ఒత్తిళ్లలో
కరిగిపోయిందో ఏమో ?
కాల ప్రవాహంలో కరిగిపోయి
తేలికయి.... అప్పుడప్పుడు
మాత్రమే కలవరింతలై
కష్టపెడుతుంది మనసు గాయాలను ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment