Monday, May 20, 2024

తామర తంపర తేది : 06-4-2023 శీర్షిక : కుప్పల తెప్పలు

 తామర తంపర

తేది : 06-4-2023
శీర్షిక : కుప్పల తెప్పలు
కవిత సంఖ్య : సహస్రాధికం 

సాంకేతికత అందిపుచ్చుకున్నాక 
శరవేగమైన సమాచార చేరవేతల 
పోటీలో...  కుప్పల తెప్పలవుతున్న వార్తలు 
పుట్టలో ఉషిల్లోలే పుట్టుకొస్తున్నాయి..
    
అసలేవో ...నకిలీ ఏవో .... తెలియకుండా
అళితేరుతున్న జనాలకు.. ప్రతిరోజు   
విభాగాలుగా విడుదల అవుతుంటే .... 
రక్తి కట్టిస్తున్న రమణీయ ధారావాహికలే .... 

ప్రజాక్షేమాలను పట్టిపీడిస్తున్న 
తామర తంపరల లాంటి అనేక 
సమస్యలను గాలికొదిలేసి 
సద్దుమణగని సమస్యలతో  వింత వైరం .... 

ఎత్తుకు పై ఎత్తులతో గమ్మత్తులు 
చాణిక్యున్ని మరిపించే చతురతలు 
ఛాతీలు విరుచుకుని జబ్బలు చరుచుకుని 
ఎంతంటే ... ఎంత ... అనుకుంటూ .... 
ప్రజల ప్రాధాన్యతలను పాతరేసే 
కొత్త సీసాలో పాత సారాయి దుకాణాలు .... 
 
అక్కడా ఇక్కడా ...అవి ఇవి  అని కాకుండా 
పక్షాల మధ్యన ....రాష్ట్రాల మధ్యన 
దేశాల మధ్యన .... అసలుకే  వింత 
ప్రాణులైన  మనుషుల మధ్య ..... 
ముళ్ళు అరిటాకుపై పడినా ... 
అరిటాకు ముళ్ళుపై పడినా 
నష్టం ఎప్పుడూ జనం ఖాతాలోనే .... 


No comments:

Post a Comment