బలం బలగం
తేది :09-05-2023
శీర్షిక : ఆర్కమెడిస్ సూత్రం
సంఖ్య: సహస్రాధికం.
అవిభాజ్యాల రోజుల్లో కుటుంబమే
బలమై ... బలగమై... దీపావళి పండగ
మతాబులోలె వెలుగుపూలు విరజిమ్మి
అంబరాన్ని చుంబించిన దాఖలాలు ....
కరెన్సీ పూల పరిమళాలు
మత్తు మందులా గమ్మత్తుల
విత్తులు చల్లుతుంటే...పచ్చని
వనమంతా చెల్లా చెదురై బీడు
వారిపోతున్నది ...
పారిశ్రామిక ప్రగతి పథమో ...
పాశ్చాత్య పడగ నీడలో ....
పాలకుల పక్షపాత ధోరణిలో ...
బ్రతుకుదెరువు పందేరంలో
కాట కలిసిపోతున్న బంధాలతో
బలం నిర్వీర్యమై బలగం మాయం ...
స్వార్థాలు అంటుమొక్కలై హైబ్రీడ్ జాతి
మర్రి మానులా విస్తరిస్తుంటే ....
బంధాలన్నీ నీడలో పెరగలేని మొక్కల్లా
తలలు వాల్చేస్తుంటే ... బలం.... బలగం...
దుర్భినికి కూడా దృశ్యమానం కానీ పరిస్థితే ....
అనామకులైతే అక్కరలేని జనానికి
అమాత్యులైతే మాత్రం అంతా మావాడే
నంటూ కితాబుల పర్వమే .... చట్టుంటే
అంతా చుట్టాలై పీచు బలగమే ....
సంపదే సర్వస్వం కాదని....
మానవత్వాల మమతల బంధమే
ఆత్మీయ లతల పరిమళాలుగా
అనురాగాల సుమధురాలను
మించింది లేదని... బోధనలకన్నా
అనుభవాల తోటలో మాత్రమే అర్ధమయ్యే
ఆర్కమెడీస్ సూత్రం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment