నమ్మకం
తేది : 07-02-2023
శీర్షిక : అమ్మలా ఉండాలి.
అమ్మలా అక్కున చేర్చుకోవాలి
గుండెల్లో నిబ్బరాన్ని నింపాలి…
అనురాగాల జల్లులు కురవాలి
మననమే మనకు బలమవ్వాలి ....
కానీ ఏమిటో కాల మహిమ అనుకుంటా
మనుషుల మధ్య మసులుతుంటే
మసక చీకట్లో నడిచినట్టుంటున్నది
అనుమానం పెనుభూతంలా ఆవరిస్తుంది ....
ప్రతి మాటలో మడత పేచీలు
పెడుతూ మంచిని కంచె దాటించి ...
చెడును మాత్రమే చెట్టాపట్టాలేసుకుని...
మనిషిని సాంతంగా స్కానింగ్ చేస్తుంటే...
సంశయాల సంచులే కనబడుతున్నాయి ....
మంచిని పరామర్శించాలన్న ఆలోచన
కొట్టుమిట్టాడుతూ ఆత్మసాక్షులు కూడా
అంతర్థానమై పోతున్నవి ....
ధవళవస్త్రాలు ధరియించి బోనమోలే
నుదుటిపైన పెద్ద పెద్ద బొట్లు పెట్టి
చిరునవ్వుల దరహాసాలతో చక్కగా
పలుకరిస్తూ ...సంప్రదాయానికి పెద్ద దిక్కయి
చిరునామాలాగా కనిపిస్తున్నా ...
కనపడని కోరల విషనాగులై
పంజా విసరని క్రూరమృగాలై
వింతగా బుసలు కొట్టకుండానే
కసిదీరా కాటేసే లోకమవుతున్నది ....
మనిషిని చూడగానే ... మనసు పుస్తకం
విప్పుకోవాలి ...అందమైన బంధమేమి
లేకపోయినా ... ఆత్మీయంగా బంధుత్వంతో
పిలుచుకునే పల్లె పరిమళాలు విచ్చుకోవాలి....
కానీ.... సాంకేతితల కనుసన్నలలో
సడేమియాలై ... కింద... మీద .. వదిలి
మధ్యదొంతరలు మాయం చేసే.... మాయల
మారాఠీలు మదిలో మెదులుతున్నారు ....
నిరక్షరాస్యులా ... అంటే... కానేకాదు ...
అక్షరాస్యతలద్దుకున్న కొంతమంది
నాయకగాణం... అత్యుత్తమ సర్వీసులైన
ఐ ఏ ఎస్ , ఐ పి ఎస్ లు నుండి మొదలుకుని
ఉన్నత పట్టాల వైద్యుల వరకు .... ప్రజా
జీవితాలతో పరాచికాలాడుతున్నారు .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment