గ్రహణం
తేది : 06-05-2023
శీర్షిక : నిందలు
పంచభూతాలు ప్రత్యక్ష
సాక్ష్యులౌతాయని... పరమ
ధర్మలెన్ని పనిగట్టుకుని
బోధించినా లాభమేమిటి ?
పట్టించుకునే తీరికేది ప్రజలకు ....
స్వార్థచింతనలకు పాద
దాసులయ్యాక... వివేక విచక్షణల
విసర్జనలే కదా మిగిలింది ...
అంతా తామనే ... అహం బ్రహ్మాస్మి
తోలు మందంతో కాదు పొమ్మంటుంది ...
ధర్మం ఎన్ని పాదాలైనా సరే ..
దరిద్రనారాయణుల గొడవైనా
దాయాదుల పోరులైనా
దమన నీతులు వల్లిస్తుంది.... ....
యుగాలు దాటిన నిజాలైనా
దశాబ్దాల నాటి దాపరికాలైనా...
మబ్బులు వీడిన సూర్యుడిలా
మండి మనలను మసిచేస్తుందనేది
అక్షర సత్యం...
అయినా నిందల గ్రహణం
మాత్రం వీడదు జీవితాంతం ....
అలవాటు కాస్తా వ్యసనమై
తప్పు మీద తప్పు చేస్తూంటే...
నిప్పుల కుప్పయిన నిజాలు ప్రజ్వలించి
కళ్ళముందు కదలాడుతూ
వాటంతటవే సాక్షాత్కరిస్తాయి.... ..
నగునూరి రాజన్న
No comments:
Post a Comment