Monday, May 20, 2024

దినపత్రిక తేది: 05-05-23

 దినపత్రిక 

తేది: 05-05-23
శీర్షిక: 

అయిదు గంటలనుండే  పడిగాపులు 
ఆలస్యానికి ఆహుతవుతూ …
సవాలక్ష ప్రశ్నలు సంధించి …
అబ్బాయిని మూడుచెర్లనీళ్ళు  
తాగించి కాని వదిలేది కాదు ఆరోజుల్లో...

ఎండా చలికి ఎదురొడ్డేవారు..
కానీ  పాపం వర్షానికి తడవకుండా 
పాలిథీన్లు కప్పుకుని పొడిపొడిగా 
తెచ్చిచ్చేవారు చదువుకోడానికి .... 

కరెంట్  అఫైర్స్ అన్నీ కంఠస్థం చేస్తే గాని 
ఛాయ టైములో చంపేయంకదా చర్చలో ... 
ప్రజాక్షేత్రంలో పవిత్రమైన దీపస్తంభమాయె 
నీతినిజాయితీలకు నిలువెత్తు నిదర్శనమాయె  ... 
ఒకప్పుడు… 

అడుగులు పడినాకొలది అచ్చుబాటైన 
తోవలా హెచ్చులకు పోయి మచ్చిక 
చేసుకున్న ధనస్వామ్యం.. పిచ్చుక మీద 
బ్రహ్మాస్త్రాలు వేసి లొంగ దీసుకున్నది మెల్ల మెల్లగా… 

వాస్తవాల నిక్కచ్చి వార్త విలేఖరులకు 
ప్రాణాలొడ్డమని పంపే సందేశాలతో
బెంబేలెత్తి బేజారై దిగజారిపోతున్న 
విలువల వలువలతో  సర్దుకుంటున్నది 
సరస్వతీదేవి... 

 ప్రజాస్వామ్యంలో పకడ్బందీగా  
పాలకులే పత్రికల బాకాలను 
తగిలించుకున్నాక... అది డబ్బానో 
గబ్బునో ... గతి తెలియక మతి చలిస్తున్నది... 

ఏదిఏమైనా మాతృభాషలో 
మమతల వంతెనలే... పిల్లలకు 
అక్షరజ్ఞానాలు  కల్పించంగా
సుద్దిబుద్దుల సుగుణాల రాశిగా ... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment