మాహా విషాదం
తేది :05-06-2023
శీర్షిక : ఒక్క కుదుపు.
సహస్రాధికం
ఆనందాలను పదిలపరుచుకుంటూ
అల్లన సాగుతున్న రైలుపయనం ....
ఉన్నట్టుండి ఒక్క కుదుపుతో
తలకిందులై తల్లడిల్లిన వైనం ....
ఒకటి కాదు రెండు కాదు... క్షణాలలో
మూడు రైళ్లు నుజ్జు నుజ్జు ...
పట్టాలనిండా బోగీలు చెల్లాచెదురు
ఆనందాలన్నీ ఆవిరైపోయిన కాలం ...
మానవ తప్పిదమో
మర్మమెరుగని మంత్రమో
మరుగుపరుచుకున్న తంత్రమో
వందల కుటుంబాల హాహాకారాలు ...
నిశి నీడలు నిగ్రహం కోల్పోయి
కోరలు చాచి కరాళ నృత్యం చేసి
కల్లాకపటమెరుగని ఎంతోమందిని
కబళించుకుపోయి త్రేన్చింది....
కాళ్ళు తెగిపడిన కళేబరాలు
చేతులూడిపోయిన శవాలు
తలలు నుజ్జయి రుధిరం
కాలువలై అభిషేకించిన నేలమ్మ ....
తల్లికి పిల్ల దూరమై
బిడ్డకు తల్లి కరువై
ఏడుపులు పెడబొబ్బలతో
ఎరుపెక్కిన చిక్కని చిమ్మ చీకటి ....
సాంకేతికత సంధికొడితేనో
సందర్భం బెడిసికొడితేనో ...
ఆజమాయిషీల అనుభవాలన్నీ
నీటిమూటలై నిగ్గదీసుకున్నవి.
చిన్న పామునైన పెద్దకర్రతో
కొట్టమన్నట్టుగా ... సలహాలను
సదా సాక్షాత్కరించుకుంటూనే
నవీనతకు పట్టం కడుతూండాలి .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment