Monday, May 20, 2024

ఆడంబరాలు తేది: 04-05-23 శీర్షిక: అదఃపాతాళమే…

 ఆడంబరాలు 

తేది: 04-05-23 
శీర్షిక: అదఃపాతాళమే… 

ఆశలే ఆశయాలకు రూపాలు 
ఆశయ గమనాలే గమ్యాలకు కేంద్రం... 
శ్రమలకు పరిశ్రమలకు పట్టుకొమ్మలై 
దీక్షా దక్షతలకు దిక్సూచియై నడకలు 
నేర్పి నాగరికతలకు వర్ణాలద్దుతాయి… 
అభివృద్ధికి ఆరోగ్యకర సంకేతాలౌతాయి... 

ఆదాయవ్యయాల సంతులనంలో 
అసమతుల్యతలెదురైతే అంతే సంగతులు ...  
ఆశలు గడపదాటి అత్యాశలైతే మాత్రం
చేబదుల్ల వింత చెడుగుడులో 
అప్పుల తిప్పళ్ళతోనో అతుకుల బతుకులో… 

లేదంటే…అడ్డదారుల గడ్డివాములతోనో..
దొడ్డిదారుల దొంగతనాలతోనో… విలువల
వలువలు విడిచిపెట్టి వింతచేష్టల వికృత
వేషాల సంతలుగా మారిపోయి…సంఘానికే
సవాలు విసురుతారు. 

విచక్షణలు విడ్డూరాల గుర్రాలెక్కుతే 
వింత వింత ఆలోచనలు బుర్రకెక్కి
కొరతల గొప్పలు గప్పాల నిప్పులై
అనుకున్నదొకటి... అయ్యేదొకటై 
అప్పుల కుప్పలలో రొప్పాల్సివస్తుంది...  

కొన్నిసార్లు… కొండమీది కోతిని అందుకోబోయి
అపాయాల అంబులెన్స్ లు ఎక్కుతారు... 
కాదంటే చేతగాక చతికిల పడిపోయి 
చడీ చప్పుడు లేకుండా చావడానికైనా
సిద్దపడిపోతుంటారు... 

అప్పడప్పుడు అతితెలివిని అక్కున 
చేర్చుకుని  హద్దులు దాటి  
స్వంతవారికి వింత పజిలుగా మారి 
పరాయిదేశాల పంచన చేరి… 
అందితే  జుట్టు అందకపోతే  కాళ్ళు 
పట్టుకుని ఆటలాడుతుంటారు... 

అయిదు వేళ్ళు ఒకంత లేకపోయినా 
అన్నీ కలిస్తేనే ముద్ద నోటికందుతుంది... 
 స్తోమతలు సమానం లేనప్పుడు
నేల విడిచి సాము చేయాలనుకోవడం అవివేకం… 
ఆరాటం తపనలు వీడాలి… 

ఉత్సవాలలో అసలుకన్నా కొసర్లకు
పోయి… అంగరంగ వైభవమంటూ 
అంతస్తులను మించి ఆటపాటలకు
ఆహారాల వృథాలకు అధికంగా ఖర్చులు
చేస్తున్నారు…

ఆరోగ్యకరమైన వాతావరణంలో 
ప్రయత్నమెప్పుడూ హర్షణీయమే... 
ఆడంబరాల జీవితాలకు పోయి 
అయినది కానిది చేస్తే అదఃపాతాళమే.. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment