Monday, May 20, 2024

పచ్చటి తోరణాలు కడదాం తేది : 04-05-2023 శీర్షిక : మమతల పరిమళాలు

 పచ్చటి తోరణాలు కడదాం

తేది : 04-05-2023
శీర్షిక : మమతల పరిమళాలు 
సంఖ్య : సహస్రాధికం 

మర్కట రూపాంతరమే మనిషి అన్న
మూల సూత్రం మననమౌతున్నది .... 
ఎక్కడో మొదలయ్యి మరెక్కడికో 
పయనమౌతున్న మానవాళి గమనం .... 

అభివృద్ధి పేరుతో అడుగులు వేస్తూ 
అసలుకు  మోసం చేసుకుంటున్నాడు .... 
అచ్చమైన నీటిని తాగలేక అలమటిస్తూ 
స్వచ్ఛమైన ప్రాణవాయువులకై ప్రయాసలతో  .... 

పచ్చనోట్ల పాముల కట్టల పడగనీడలో 
సేదదీరుతూ...సాంతం విషపూరితం చేసుకుంటూ 
మానవీయ  మమతల కోటలను బద్దలు కొట్టి 
ఆత్మీయతలను బీటలు వార్చుతున్నది .... 

అడవులను అడ్డంగా నరికివేస్తూ 
అవసరానికి మించి కొండలను పిండి చేస్తూ 
ఇసుకతిన్నెలను ఇగురంగా బొక్కుతూ .... 
 అడుగడుగున ప్రకృతిని చెరబడుతూ  .... 

కళ్ళున్న కబోదిలా భవిష్యత్తును దర్శించలేక... 
అంధత్వాన్ని అలుముకుని ... బంధాలను 
బంధుత్వాలను పక్కకు నెడుతూ ... దినదినం 
బ్రతుకును దుర్భరం చేసుకుంటూ  దిక్కు దివాణం 
లేక బిక్క మొహం వేసుకుంటున్నాడు .... 

ఇప్పటికైనా ...అక్కడక్కడా మిగిలిన  విజ్ఞులు 
మానవతా విలువల విత్తులు నాటాలి .... 
మమతల కోవెలలో పచ్చతోరణాలు కట్టాలి .... 
అనురాగాలను స్పృశిస్తూ అక్కున చేర్చుకుని .... 

ప్రకృతి మానవాళికై  పంచుతున్న ప్రేమలను 
స్ఫురణకు తెస్తూ... మనుషులలో  గడ్డ 
కట్టుకున్న అమృతభాండాలాను కదిలించి 
మమతల పరిమళాలను  పరివ్యాప్తి చేయాలి ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment