Tuesday, May 21, 2024

త్యాగానికి ప్రతీక తేది : 02-06-2023 శీర్షిక : అమరవీరుల స్థూపం

 త్యాగానికి ప్రతీక 

తేది : 02-06-2023
శీర్షిక : అమరవీరుల స్థూపం

పేరుకే ప్రజాప్రభుత్వం 
పెద్దమనుషుల ఒప్పందాలు 
తెర వెనుక బాగోతాలు 
మనవాళ్లను నెగలనీయని తనం .... 

సమైక్య రాష్ట్రములో సచివాలయం  
ముఖం తెలియదు తెలంగాణోళ్లకు .... 
చివరి బంతి భోజనంలా ఎప్పుడు 
చిన్న చితక ఉద్యోగాలే మనోళ్లకు .... 

అభివృద్ధి అడుగుజాడలన్నీ 
చేప నీటిని తోడుకున్నట్టే .... 
నిజామాబాద్ శ్రీరాం సాగరైనా
రామప్ప పాఖాల లక్నవరం 
చెరువుల నీటి పారుదల భూములైనా ...  
నల్గొండ నాగార్జున సాగరమైనా .... 

అడుగడుగున వలసలతో 
సల సల మసిలి అట్టుడికింది....  
తొలిదశగా అరువది తొమ్మిదిలో 
ఆంధ్రా గోబ్యాక్ అంటూ నినదించింది .... 
369 మందిని బలి ఇచ్చింది .... 

మంత్రమేదో వేసి... మంతనాలు చేసి
మసిపూసి మారేడు కాయ చేసి
మభ్యపెట్టి  మాయజేసి కాకమ్మ 
కబుర్లతో కార్యం ఒడ్డెక్కించుకుని .. 
బుద్ది చూపి సద్దిగిన్నె మాయం చేసారు.... 

ఎప్పటోలె మాటలతో బురిడీ కొట్టించి 
మౌలిక సదుపాయాలన్నీ తరలించి 
బడి జాడలు ... గుడి జాడలు 
కానరాకుండా చేసి ... చెరువులన్నీ 
గండి పడితే ... పడావుంచి నీళ్లన్నీ 
మళ్లించుకుని ఎడారిని తలపించారు .... 

నల్లబంగారు గూడెంలో మొదలైయ్యి 
కాలు మోపి విస్తరించారు కరీంనగర్ 
ఆదిలాబాద్ వరంగల్లు ... ఆఖరుకు 
అట్టడుగు మజ్దూర్ పోస్టులకు కూడా .... 

బాష యాస కవులు కళాకారులు 
కాకతీయ కళా వైభవాలు కనుమరుగే 
చిన్నా చితక ఘర్షణలకు చిత్రంగా 
మతం రంగు బూచి పులిమి... మేం తోడుంటేనే 
బలమంటూ మభ్య పెడుతుండేవారు .... 

నీళ్లు నిధులు నియమాకాలంటూ 
నిగారించుకున్నది అగ్నికణం ....మలివిడత  
సల్లు బిగి అవుతూనే ... సరైన సమయంలో
సంధి కొట్టి  సకల జనుల సమ్మెతో ఉదృతమయ్యింది ... 

కరకర పొడిచే పొద్దును చీల్చుతూ 
ఎల్  బి  నగర్ జంక్షన్లో వందలమంది మధ్య 
తొలికిరణం రూపంలో శ్రీకాంతాచారి 
మరణం అశనిపాతమై ఎగిసింది ..... 
1200 మందిదాకా అందరూ అమరజ్యోతులే ...

పల్లె, పట్నం, ఊరు, వాడ ఏకమై ఉద్యమం ఉప్పెనైంది 
సకల జనుల సమ్మెతో ఉద్యమ ఉనికే మారి పోయింది 
కళాకారుల హోరుతో కదం తొక్కి ఉవ్వెత్తున  నిలిచింది 
దిగి వచ్చిన కేంద్రం దిగ్విజయముగా అందించినది 
29 వ రాష్ట్రంగా… మలివిడత  పోరాటంలో .... 
 
1600 మంది త్యాగాలతో పదిలమయింది 
పంతం పట్టి  తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా  .... 
క్షణమైనా మరువలేము వారి  త్యాగాలు 
క్షంతవ్యం కాబోదు తరతరాలకు .... 
తనువున్నంత సేపు తలుచుకోవాల్సిందే .... 

సమరం చేసి నేలకొరిగిన 
కొదమసింహాల జ్ఞాపకం .... 
అమరవీరుల స్థూపమది 
తనువెల్లా అల్లుకున్న త్యాగాల చిరునామా ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment