వెలుగు జిలుగుల లోకం
తేది : 01-06-2023
శీర్షిక : రంగుల ప్రపంచం ....
పచ్చపువ్వోలె విచ్చుకున్న పల్లెపట్టున
ప్రకృతమ్మ జాడలలో మట్టిగోడలతో
బుట్ట బొమ్మల్లాంటి ఇంటి పరిసరాలు
మధురమైన మమతల పరిమళాలతో
మనసుకు చుట్టుకున్న అనుబంధాలు...
నవ నాగరికతల నడకలలో
నగరీకరణలు రూపుదిద్దుకున్నాక
తడారిపోయే రాతి పొడితో రంజిల్లుతున్న
లెక్క లేనన్ని అంతస్తుల ఆకాశ హర్మ్యాలు ...
మేడిపండును మరిపించే
మేలిమి రంగుల మెరుపులు ....
పైపై మెరుగుల బంగారువర్ణాలు
సంపూర్ణత సాధించని పనికి రాని చేతలు ...
ముచ్చటగా చెప్పుకుని మురిసిపోయే
ప్రధాన రహదారుల పటాటోపం ...
మట్టి వాసన కోల్పోయిన
మళ్ళీ మళ్ళీ వేసే బ్లాక్ టాపింగులు...
ఆత్మీయతల చమురు లేనట్టి
అల్లిబిల్లిగా అల్లుకునే నియాన్ లైట్ల
జిలుగు వెలుగుల లోకం....
ఊరికి దూరంగా విసిరి వేయబడిన
అనేక గుడ్డి దీపాల వెలుగు జీవితాలు
మరుగున పడిపోతున్న మమతల ఊసుల్లా
ఎవరికీ పట్టని వెట్టి చాకిరీల వెతలు .....
నగిషీలు చెక్కిన నాణేనికి ఇరువైపుల్లా
జిలుగు వెలుగుల మెరుపులు ఒకవైపు
గుడ్డి దీపాల గూని బతుకులు మరోవైపు
ముడి విప్పని రంగుల ప్రపంచపు రాచ వీధులు ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment