Monday, May 20, 2024

మే డే. 01-05-23 శీర్షిక… సర్వంతర్యామి

 మే డే.  

01-05-23
శీర్షిక… సర్వంతర్యామి 

సూర్యుడికన్నా ముందే పయనం  
కారం కలిపిన ముద్దైతే చాలు 
కాలు బయట పెట్టాడానికి 
కందకమైనా…కట్టడమైనా చుట్టమౌతాడు … 

రాతి గుహాల జీవనాలు 
రంగుల భవనాలకు మారేదాకా… 
కంద మూలాలనుండి 
వండి వార్చే వంటలదాకా.... 

ఆకాశహార్మ్యాల అడ్రసులయినా …
అఖాత ఖనిజాల చిరునామాలకైనా… 
వాయుతరంగాల వంతలకైనా… 
సంద్రపులోతుల సంపదలకైనా… 

పెరుగు చిలికిన  వెన్నలా 
రుధిరం స్వేదమైతేనే ... 
కొలిమిలో కాల్చిన కర్రులా 
కండరాలు కరిగిస్తేనే ... 
దూది ఏకిన  పరుపులా 
నరాలను  మీటితేనే .... 
ఐదు వేళ్ళు నోటికి అందిస్తాయి. 

సర్వాంతర్యామిలా వ్యాపించినది ... 
అన్ని సంపదలకు మూలం శ్రమ... 
వ్యక్తులకైనా...దేశాలకైనా...విశ్వానికైనా... 
అయినా ఆకలిని జయించలేకపోతుంది  ..... 

అంగబలం, అర్థబలం, విజ్ఞానం, రాజకీయం.. 
కలిసికట్టుగానో ... విడివిడిగానో ....స్థాయి ప్రకారంగా 
సతాయిస్తూ శ్రమపై దాడి చేస్తూనే ఉన్నాయి... 
నాగ "మణి" లాంటి శ్రమ రత్నరాసులను
కొల్లగొడుతూ ..పోగేసుకోవడంలో ...
అందరూ పోటీదారులే ... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment